ములుగు, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ అమలులో నిర్లక్ష్యంవహించిన బ్యాంకర్లపై చర్యలకు సంబంధిత బ్యాంకుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు మండలం శివతండా గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం 190 కోట్లు మంజూరు చేసిందని అన్నారు.
బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా కేవలం 100 కోట్ల మేర రైతుల ఖాతా ల్లో జమయ్యాయని పేర్కొన్నారు. విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏలో బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించామని, 15 రోజుల క్రితం మరో 40 కోట్లు జమ చేయించినట్టు తెలిపారు. మరో 50కోట్లు బ్యాంకర్ల వద్దనే ఉన్నాయని, వాటినీ ఖాతాల్లో జమ చేయిస్తామని హామీ ఇచ్చారు.