హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ)/వనపర్తి టౌన్/రూరల్: కాంగ్రెస్ నాయకులు ఐదు దశాబ్దాలపాటు వివిధ దశల్లో అధికారాన్ని అనుభవించి తెలంగాణను విస్మరించడం వల్లే నాడు పాలమూరు వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులకు చిరునామాగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారి పెండింగ్ పాలన పాపానికి అన్నదాతలు ఆత్మహత్యల పాలయ్యారని మండిపడ్డారు. గురువారం జడ్చర్ల బహిరంగ సభ లో కాంగ్రెస్ నాయకులు చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై మంత్రి నిప్పులు చెరిగారు. శుక్రవారం వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ది ‘పెండింగ్ పాలన’ అని ఎ ద్దేవా చేశారు. వారి పాలనలో నీళ్లు, నిధులు, కరెం టు, పింఛన్ ఇలా సమస్యలన్నీ పెండింగేనని చెప్పా రు. కాంగ్రెస్ నాయకులు ఏ మొఖం పెట్టుకొని పాలమూరు ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
ఐదు దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్‌కు పాలమూరు ప్రజలు చరమగీతం పాడుతూ బీఆర్ఎస్ నాలుగున్నరేండ్ల పాలన చూసి మొత్తం 14 నియోజకవర్గాలకు 13 సీట్లు ఇచ్చి కృతజ్ఞత తెలుపుకున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. విద్యార్థుల బలిదానాలు, అన్నదాతల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపపు పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒక జీవిత కాలానికి సరిపడా పాపం చేసిందని అన్నారు. కాంగ్రెస్ నాయకుల శాపనార్థాలను పట్టించుకోబోమని, ప్రజల తీర్పే తమకు అంతిమం అని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో నీళ్లు ఇచ్చిండు కేసీఆర్, ఉపాధి అవకాశాలు కల్పించిండు, పల్లెలు, పట్టణాలు, పరిశ్రమలు బాగుపడ్డయి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా పురోగమిస్తున్నదని తెలిపారు. ఈ విజయాలన్నీ మీకు వైఫల్యాలుగా కనిపిస్తున్నాయా? అంటూ నిలదీశారు.