మహబూబ్‌నగర్ : రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో కొన్ని కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తి దారులకు ఉపాధి కల్పించేందుకే సీఎం కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 రూపాయలకు పెంచిన పింఛన్, బీసీ కుల వృత్తి దారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో 11వేల పై చిలుకు దివ్యాంగులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్స్ అందజేశామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచందన్నారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తదితరులు పాల్గొన్నారు.