హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ అజ్ఞాని అని, సీఎం కేసీఆర్‌ను రైతువ్యతిరేకి అనడమే ఇందుకు నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు సభలో అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. రైతుబీమా, రైతుబంధు, సాగునీరు, ఉచిత విద్యుత్తు ఇచ్చి రాష్ట్రంలో అనతికాలంలోనే వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల కోసం, వ్యవసాయ అభివృద్ధికి ఏం చేసిందని ప్రశ్నించారు.
ఫసల్‌బీమా యోజన గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లపై బీజేపీ వైఖరిని అమిత్ షా స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరిగా వ్యవసాయ పథకాలు అమలు చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన దొడ్డు వడ్లను ఇప్పుడు కొనరట కానీ, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కొంటామనడం దేనికి సంకేతమని నిలదీశారు.
అంటే కేంద్రం ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నట్టే కదా? అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని హామీలను కూడా నెరవేర్చారని, కానీ బీజేపీ మాత్రం మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను కూడా తుంగలో తొక్కిందని విమర్శించారు. అమిత్ షా ఆగ్రహిస్తే తలవంచడానికి తెలంగాణ సామంత రాజ్యం కాదని పేర్కొన్నారు.