హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘సీఎం కేసీఆర్‌ను తిట్టినంత మాత్రాన నీవు హీరో కాలేవు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకు లేవు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితులెప్పుడూ ఒకేవిధంగా ఉండబోవని, భాష మార్చుకోవాలని హెచ్చరించారు. చేతనైతే సీఎం కేసీఆర్ సిద్ధాంతాలపై పోరాటం చేయాలని, వ్యక్తిగత దూషణలకు దిగొద్దని హితవు పలికారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తాతా మధుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మూడు గంటల కరెంట్ చాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బ్యాక్‌ఫైర్ కావడంతో రేవంత్‌రెడ్డిలో అసహనం పెరిగిపోయిందని, అందుకే సోయితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ భాషను సొంతపార్టీ కార్యకర్తలే ఈసడించుకొంటున్నారని పేర్కొన్నారు. రెండోసారి ప్రజలు ఆమోదించిన ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దుర్భాషలాడటం సహేతుకం కాదని, ఈ విషయంపై ప్రజలు విజ్ఞత కలిగి ఉంటారన్న విషయం గుర్తెరగాలని సూచించారు. రేవంత్ తన చర్యలు, నోటి దురుసుతనంతో అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బతికుండగానే పిండం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డివంటి వారి అసందర్భ, దుర్మార్గపు వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు.
చిల్లర రాజకీయాలకు కేరాఫ్ రేవంత్: భానుప్రసాద్
రాష్ట్రంలో చిల్లర రాజకీయాలకు రేవంత్ కేరాఫ్ అడ్రస్‌గా మారారని, చిల్లర పనులు చేస్తూ వార్తల్లో ఉండేందుకు తపిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్ విమర్శించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌కు లేదని పేర్కొన్నారు. రేవంత్ ముందు సొంత ఇంటిని చకదిద్దుకోవాలని సూచించారు. రాజకీయాల్లో రేవంత్ ఓ బఫూన్ అని, అలాంటి వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడు కావడం ఆ పార్టీ ఖర్మ అని ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఏజెంట్, బ్రోకర్ రేవంత్ అని విమర్శించారు. ఇప్పటికైనా భాష మార్చుకోవాలని, లేనిపక్షంలో గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండబోదని రేవంత్‌ను హెచ్చరించారు.
సీఎం కేసీఆర్‌ను తిట్టినంత మాత్రాన హీరోవు కాలేవు. పరిస్థితులెప్పుడూ ఒకేవిధంగా ఉండవు. భాష మార్చుకో. చేతనైతే కేసీఆర్ సిద్ధాంతా లపై పోరాటం చేయి. వ్యక్తిగత దూషణలకు దిగొద్దు. రేవంత్‌రెడ్డి సోయితప్పి మాట్లాడుతున్నడు.
-మంత్రి నిరంజన్‌రెడ్డి