హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల పథకం జాప్యానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి, అడ్డంకులు సృష్టించకుంటే, ఈ పాటికే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని పేర్కొన్నారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని బిజినేపల్లిలో నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అధికారంపై కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటుందని పేర్కొన్నారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపి ఎడారి చేసినందుకు కాంగ్రెస్ను గెలిపించాలా? కలిపిన తెలంగాణను తిరిగి సాధించుకునేందుకు వేల మంది బలిదానాలకు కారణమైనందుకు కాంగ్రెస్ను గెలిపించాలా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో నేడు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పష్టం చేశారు. రేపు పాలమూరు రంగారెడ్డి పూర్తయితే రాబోయే రెండేళ్లలో 23 నుంచి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పుణ్యాన రూ. 30 వేలకు ఎకరా చొప్పున భూమిని రైతులు అమ్ముకున్నారు. నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా రూ. 20 లక్షలకు తగ్గకుండా ఎకరా భూమి అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 13 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో వైఫల్యమే నేటి బీజేపీ నియంతృత్వానికి కారణం అని చెప్పారు. సరైన సమయంలో బీజేపీ విధానాలపై పోరాడకుండా చేతులు కట్టుకుని కూర్చొన్నారని ధ్వజమెత్తారు. గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వెళ్లని రాహుల్ గాంధీ బీజేపీని ఎలా ఓడిస్తారు? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ టోకున అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణతో ధరలు పెరిగి పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు ఆగమైతుంటే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పోషించిన పాత్ర ఏంటి? అని మంత్రి నిరంజన్ రెడ్డి కడిగిపారేశారు.