హైదరాబాద్ : తెలంగాణ రైతుల పట్ల బీజేపీ మొసలి కన్నీరు ఆపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంజయ్ లేఖ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉందని ఎద్దెవా చేశారు. వడ్లు కొనిపించే బాధ్యత తనదేనన్న సంజయ్.. ధాన్యం కొనుగోలు సమయానికి ముఖం చాటేశారని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో యాసంగి వడ్లు కొనుగోలు చేశారని తెలిపారు. రైతుబంధుకు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చాలా తేడా ఉందన్నారు. రూ. 7,500 కోట్లకు, రూ. 580 కోట్లకు తేడా తెలుసుకోవాలని మంత్రి చురకలంటించారు. తమ ప్రభుత్వం ఏటా రైతుబీమాకు చేస్తున్న ఖర్చు రూ. 1,500 కోట్లు అని తెలిపారు. రైతుబంధు గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్కు లేదని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.