వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అండగా ఉండి, ఆర్థిక బరోసా కల్పించేందుకు ‘ఆసరా’ పెన్షన్లను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలంలోని రాజపేట, అచ్యుతాపూర్, చిట్యాల, అప్పాయిపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను మంత్రి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమాజంలో సమున్నతంగా ఎదగాలని, అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.
ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. అర్హులైన వారిని గుర్తించి, ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.