మేడ్చల్ : బీసీ కుల,చేతివృత్తుల వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశపుహాల్లో మొదటి విడత బీసీ కుల, చేతివృత్తుల లబ్ధిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయ చెక్కుల ( Checks ) ను మంత్రి అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR ) ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వృత్తికి సంబంధించిన ఆధునిక పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకుని ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అన్ని కులాల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని, దళితులకు దళితబంధు (Dalit Bandu ) , గొల్లకుర్మలకు మేకలు, గొర్రెలు, మత్స్యకార్మికులు వ్యాపారాలు చేసుకునేలా వాహనాలు, పనిముట్లను అందిస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించేలా పథకాల రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. అనుక్షణం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పరితపించే కేసీఆర్ దేశంలోనే బెస్ట్ సీఎం అని కొనియాడారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మొదటి దశలో ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగ్యస్త, బీసీ సంక్షేమాధికారి కేశురాంతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.