మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 23: ‘బండి సంజయ్ ఖబర్దార్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ ప్రజలు సహించరు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. శనివారం మేడ్చల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఓ మెంటల్ అని, బీజేపీ దగా కోరు పార్టీ.. కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని వ్యాఖ్యానించారు. బండి పాదయాత్ర ఎందుకో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.
సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే కేసీఆర్ నంబర్ వన్ సీఎంగా నిలిచారని కొనియాడారు. ఆయనను దూషిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, బీజేపీ నాయకులను తరిమి కొడతారన్నారు. బీజేపీ సింగిల్ డిజిట్ గాళ్లు ఏమీ చేయలేరని విమర్శించారు. 8 ఏండ్లుగా కేంద్రంలో, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, చేసిందేమీ లేదని.. ఇంటింటికి నీళ్లు ఇచ్చిండ్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు.. అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే పాదయాత్రలు చేస్తూ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.