నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 6: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. సోమవారం వివిధ ప్రాంతాల్లో మురుగు కాల్వల పూడిక తీత, రోడ్డు పక్కన పొదల తొలగిం పు, శిథిలాల తరలింపుతోపాటు భారీగా మొక్కలు నాటారు. ప్రమాదకరస్థితిలో కిందికి వేలాడే విద్యుత్తు తీగల సమస్యలు పరిష్కరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలు, పట్టణాలలో ర్యాలీలు నిర్వహించి ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు.
రాష్ట్రంలో సంక్షేమం పరుగులు: మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉపాధి కోసం గ్రామాలను విడిచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండబోదన్నారు. భవిష్యత్తు అంతా గ్రామాలదేనని చెప్పారు. సోమవారం వనపర్తి మండలం పెద్దగూడెంతండాలో మంత్రి మార్నింగ్‌వాక్ చేశారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… ప్రతి ఊరిలో సాగు నీరు పరుగులు పెడుతున్నదని చెప్పారు. దీంతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయన్నారు. పంటలు పండటమే కాకుండా గ్రామాల్లో కూలీలకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని వివరించారు. బడిబాట నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు.
కేసీఆర్‌తోనే మారిన పల్లెలు: మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కృషితో ఎనిమిదేండ్లలోనే రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల కేంద్రం, ముఖ్యమంత్రి దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసిన ఎర్రబెల్లి పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ, పల్లె ప్రగతితో అభివృద్ధి జరుగుతున్నదన్నారు.
పరిసరాలు శుభ్రతతో వ్యాధులు రావు: మంత్రి పువ్వాడ
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్దేశించిన అన్ని పనులనూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. పీఎస్ఆర్ రోడ్డులో కాల్వలో మురుగు తొలగించే పనులను ప్రారంభించారు.
గాంధీచౌక్ సెంటర్లో రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. రాపర్తినగర్లో కచ్చా నాలా శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. లక్ష్మీగార్డెన్స్ ఎదురుగా నూతనంగా ఏర్పా టు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 14, 16, 36, 40, 41, 42, 45 డివిజన్లలో నర్సరీలను పరిశీలించారు. వచ్చే హరితహారం కోసం ప్రభుత్వ లక్ష్యానికి మించి మొకలను సిద్ధం చేయాలని ఆదేశించారు.