హైదరాబాద్ : ఇది మాటల ప్రభుత్వం కాదు.. ఇది చేతల ప్రభుత్వం.. ఇది చేనేతల ప్రభుత్వం.. ఇది మీ ప్రభుత్వం అని కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధాని మోదీ అని దుయ్యబట్టారు. చేనేత మీద విధించిన ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి మొట్టమొదట నేనే లేఖ రాస్తున్నాను. మీరంతా కూడా లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. నారాయణపేటలో చేనేత పార్కు పెడుతామని అమిత్ షా ఆరేండ్ల కింద చెప్పారు. ఇప్పటి వరకు అతీగతి లేదు. బీజేపీ నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.
చేనేతలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని మండిపడ్డారు. చేనేతల చేయూతల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కొత్త పథకాలు అమలు చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలను ఎత్తి వేశారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయని విధంగా చేనేతపై ఐదు శాతం జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీ అని విమర్శించారు. అవసరమైతే చేనేత రుణమాఫీకి మరోసారి ఆలోచిస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నకు బీమా కల్పిస్తున్నాం. నేతన్నకు బీమా ఈ దేశ ప్రధాని ఆలోచించలేదు. కానీ కేసీఆర్ నేతన్న బీమా పథకం తీసుకొచ్చి చేనేతల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వారం రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.