సంపాదన పెంచేవారిని ఎన్నుకోకపోతే ఎల్లకాలం పేదలు.. పేదలుగానే మిగిలిపోతారు. ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవరు మంచి చేస్తారు? సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎవరు అందిస్తున్నారు? ఎవరైతే పిల్లల విద్యపై దృష్టిపెట్టి వారిని బాగు చేస్తున్నారు? ఎవరైతే పెట్టుబడులు తీసుకొస్తారు? పరిశ్రమలను ఎవరు ప్రోత్సహిస్తారు? పిల్లలకు ఉపాధి అవకాశాలను ఎవరు పెంచుతారు? ప్రజారోగ్యంపై ఎవరు దృష్టిపెట్టారు? అనేది గమనించి వారికి మాత్రమే ఓటు వేయండి.
-జయప్రకాశ్ నారాయణ
Jaya Prakash Narayana | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ‘నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకులతో అగ్రస్థాయిలో నాకు మంచి సంబంధాలున్నాయి. నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను. పరిపాలనా సంస్కరణ సంఘంలో పనిచేశాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయానికి గురై.. ఎన్నికల్లో గెలిచేందుకు దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను ఆవేదనతో చెప్తున్నా.. ఆ పార్టీ అనేక చర్యలు అలానే ఉన్నాయి. ఉదాహరణకు ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్)పై కేసీఆర్‌గారు పరిశీలించి అటు ప్రజలకు, ఉద్యోగులకు న్యాయం అయ్యేట్టు చేద్దామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఓపీఎస్ ఇచ్చేస్తామని చెప్పింది.
కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఓపీఎస్‌ను అమలుచేస్తున్నారు. బ్యాలన్స్ తీసుకురాకపోతే కచ్చితంగా ఆ రాష్ర్టాలు నాశనమైపోతాయ్’ అని వ్యాఖ్యానించారు. ‘మన చర్యలవల్ల దేశమే ఓడిపోయేటైట్టెతే ఎవరు గెలుస్తారని సాక్షాత్తూ నెహ్రూ చెప్పారు. నేను గెలవడంకోసం దేశం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదనే పరిస్థితి తేవడం ప్రమాదకరమని అన్నారు’ అని జేపీ గుర్తు చేశారు. నేడు నిరాశతో ఉన్న వర్గాలకు ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉన్నదని, దీర్ఘకాలంలో ఆదాయాలు పెరిగి, ఉపాధి కల్పన జరిగే ఏర్పాట్లు లేకుంటే రాష్ట్ర, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ టీవీ చానల్లో జేపీతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు తదితర అంశాలపై కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు జేపీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలను సమభావంతో చూస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని జేపీ కొనియాడారు. ఉద్యమం సందర్భంగా నెలకొన్న అన్ని రకాల సందేహాలు, భయాలను కేసీఆర్ పటాపంచలు చేశారని ప్రశంసించారు. కేంద్రంలో ఆర్థిక పరిస్థితి ‘పైన పటారం.. లోన లొటారం’లా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నెలకొన్న సందేహాలు, భయాలపై సమాధానమిస్తూ.. ఉద్యమం సందర్భంగా తనపైనే అధికంగా ఒత్తిడి ఉండేదని జేపీ చెప్పారు. తెలంగాణ పర్యటనలో అంతా ‘జై తెలంగాణ’ అనాలనే డిమాండ్లు వచ్చేవని, ఆంధ్రా ప్రాంతంలో ‘సమైక్యాంధ్ర’ అనాలని ఒత్తిడి తెచ్చేవారని గుర్తుచేశారు. ఆంధ్రా, తెలంగాణ కలిసుంటే మంచిదని, ఒకవేళ విడిపోవాల్సి వస్తే సామరస్యంగా విడిపోవాలనే తాను కోరుకున్నట్టు చెప్పారు. ఉద్యమం సందర్భంగా హైదరాబాద్‌పై అనేక సందేహాలు, భయాలు ఉండేవని, వాటిని పటాపంచలు చేస్తూ అందరినీ సమానంగా ఆదరిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ కాస్మో పాలిటన్ కల్చర్ దేశ ఐక్యతకి ప్రతీకగా ఉన్నదని, అందరినీ సమానంగా ఆదరించడం ద్వారా ఈ సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేసిందని చెప్పారు. ఇది మనందరికీ గర్వకారణమని, ఎలాంటి భేదభావాలు లేకుండా చేయడం తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడి నాయకత్వం ఘనతేనని కొనియాడారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై జేపీ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధిని, సంపద సృష్టిని ఆపకూడదని, అదే సమయంలో సంక్షేమం ద్వారా సామాన్యుడిని ఆదుకోకుంటే ప్రజాస్వామ్యం నడవదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ సమతూకాన్ని పాటించే ప్రయత్నాలు విజయవంతంగా చేసిందని అభినందించారు. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో సామరస్యాన్ని పెంచడంతోపాటు హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చేసిందని చెప్పారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. చాలామంది ఉత్తరాదివారు కూడా హైదరాబాద్‌లో ఆస్తులు కొంటున్నారని, ఇది ఎంతో గర్వించాల్సిన విషయమని చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ అనేది ఎంతో క్లిష్టమైనదని, మన దేశంలో పెట్టుబడి పెట్టి సంపద సృష్టిస్తే అది పాపం చేశారనే భావన ఎంతో కాలంగా ఉందని అన్నారు. పదిమందికి ఉపాధి కల్పించేవాడు దేవుడని, ఆత్మవిశాసాన్ని, సంపదను పెంచి, ఆదాయాన్ని తెచ్చేవాడు దేవుడని, అటువంటివాళ్లకు ఇప్పుడు గౌరవం లభిస్తున్నదని తెలిపారు. ఇంతకాలం వాళ్లను పురుగుల్లా చూశారని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో రిస్క్ తీసుకొని తాను కొంత సంపాదించి, నలుగురికి ఉపాధి చూపించేవాడు దేశానికి అవసరమని చెప్పారు. దానికోసం మౌలిక సదుపాయాలు, అర్బనైజేషన్, స్కిల్ డెవలప్మెంట్ అవసరమని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ైక్లెమేట్ ఉండాలని, ఇవి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులవల్ల దేశం బాగుపడుతుందనే భ్రమనుంచి బయటపడాలని సూచించారు. తెలంగాణలో ఒక ప్రోయాక్టిక్ వాతావరణాన్ని ఏర్పాటు చేశారని కితాబిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన సహకారంపై కేటీఆర్ అడిగిన ప్రశ్నకు జేపీ సమాధానమిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్రం దగ్గర డబ్బులేదని, దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని తెలిపారు. రూ. 33లక్షల కోట్లు బడ్జెట్లో ఆదాయం వస్తుంటే, 18 లక్షల కోట్లు రాష్ర్టాలకు పోతున్నాయని, రూ.10 లక్షలకోట్లు వడ్డీలకు, రూ.8లక్షల కోట్లు జీతభత్యాలకు ఖర్చవుతున్నాయని, ఒక్క పని కూడా చేసే పరిస్థితి లేదని వివరించారు. తెలంగాణ సర్కారు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెంచేందుకు కృషిచేయడం అభినందనీయమని అన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌తో పాటే ఇతర పట్టణాలు కూడా పెరగాలని, రవాణా పెంచితే గొప్ప విజయవంతమైన తెలంగాణగా ఎదుగుతుందని చెప్పారు. విద్యుత్తు కొరత లేకుండా చేయడం ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు.
హైదరాబాద్ పచ్చగా ఉంది.. వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వారికి భద్రత ఉంటుందా? రేపు వివక్ష ఎదురవుతుందా? శాంతిభద్రతల సమస్య ఏమైనా ఏర్పడుతుందా? అనే భయాలు ఉద్యమ సమయంలో ఉండేవి. ఈ విషయంలో బీఆర్ఎస్ను నూటికి నూరుపాళ్లు అభినందించాల్సిందే. ఆంధ్రా, తెలంగాణ అనే భావన లేకుండా నిండు మనసుతో పరిపాలన చేస్తున్నారు.
-జయప్రకాశ్ నారాయణ
మన దేశంలో అభివృద్ధి ఆధారంగా గెలుపొందుతామనే గ్యారెంటీ లేదని, చాలా రంగాల్లో వైఫల్యాలవల్ల ఎంతో మంది పేదరికంలో ఉండిపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో 7 లేదా 8 శాతం అభివృద్ధి ఉంటే ఆ ప్రభుత్వం మళ్లీ గెలవడం గ్యారెంటీ అని, ఇండియాలో ఆ గ్యారెంటీ లేదని తెలిపారు. నైపుణ్యం, మోటివేషన్ లేకుండా ఉండడం వల్ల ప్రభుత్వాలు ఏమిచేసినా చాలామంది ప్రజలకు కావాల్సిన ప్రయోజనం లభించడంలేదని చెప్పారు. ఇలాంటివారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్నారని అన్నారు. ఆ నమ్మకం లేనప్పుడు గ్రోత్ రేట్ ఒక్కటే సరిపోదని, సంక్షేమం వద్దంటే ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు నడవవని చెప్పారు. అమెరికా వంటి దేశాల్లో సైతం వివిధ రూపాల్లో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, సంక్షేమమే పరిపాలన అనుకోవడం సరికాదని అన్నారు.
తెలంగాణ పుణ్యమా అని రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగాయని జేపీ పేర్కొన్నారు. పూర్వీకులు సంపాదించిన ఆస్తులున్నవాళ్లు వందల కోట్లు సంపాదిస్తున్నారని చెప్పారు. రాజకీయంలో గెలిస్తే.. ఓ విజన్‌తో ఏదో చెయ్యొచ్చని కొందరు భావిస్తుంటారని, ఇంకొందరు డబ్బు ద్వారా రాజకీయాల్లోకి రావాలని చూస్తుంటారని అన్నారు. దీని వల్ల తలకుమించిన ఖర్చు చేసి కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారని, ఎన్నికల వేళ ఖర్చు తగ్గించే మార్గాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఎలక్ట్రోరల్ ఖర్చును తగ్గించాలని, అందుకు రాజకీయ పార్టీల నాయకులను కూర్చోబెట్టి మాట్లాడేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఎందుకంటే డబ్బులిస్తేనే ఓటేస్తామనే స్థితికి కొందరు ఓటర్లు వస్తే.. నాయకులు కూడా ఎన్నికల్లో ఓడిపోవడం కంటే.. చనిపోవడం మేలనుకునేలా తయారవుతున్నారని అన్నారు.
చిన్నవయసులోనే మంత్రి కేటీఆర్‌కు రాజకీయాలపై అపారమైన అనుభవం వచ్చిందని జేపీ అభినందించారు. ‘మీరు అనుకోని పరిస్థితుల్లో.. ఉద్యమ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రిగా ప్రత్యేకించి వెల్త్ క్రియేషన్, అర్బన్ మేనేజ్మెంట్ చేశారు. మొత్తంగా అభివృద్ధివైపు రాష్ర్టాన్ని తీసుకెళ్తున్నారు చాలా సంతోషం’ అని కేటీఆర్‌నుద్దేశించి అన్నారు. ఎంతో తలనొప్పిగా ఉండే రాజకీయాలను సులువుగా కేటీఆర్ డీల్ చేసే విధానం గొప్పగా ఉంటుందని ప్రశంసించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అది తన తండ్రి నుంచి నేర్చుకున్నట్టు చెప్పారు. ప్రతిరోజూ తన తండ్రి నేర్పిన అలవాట్లలో భాగంగా 10-15 పేపర్ల చదువుతానని, ఓ మంత్రిగా, ఎమ్మెల్యేగా సర్పంచ్ నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజలతో కలిసి ఉంటూ.. రోజు ఎలా గడుస్తుందో తెలియకుండా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ‘నేను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక్క రూపాయి పంచలేదు. ఒక్క చుక్క మందు పొయ్యలేదు. ఎన్నికలు జీవన్మరణ సమస్య కాకూడదు. నాకునేను సమాధానం చెప్పుకోవాలి. పనిచేసి గెలిచానా..? పంచి గెలిచానా? అనేది నాకు చాలా ముఖ్యం’ అంటూ మంత్రి కేటీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డబ్బులు ఆశించకుండా.. చేసిన పనులు మాత్రమే చూసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసేవాళ్లకు మాత్రమే ఓటెయ్యాలని జయప్రకాశ్ నారాయణ కోరారు. ‘మన దేశంలో 85శాతం మందికి రెక్కాడితే కానీ డొక్కాడని రోజులున్న నేపథ్యంలో ఎవరు మీ పిల్లలను కాపాడాతారో వారిని ఎన్నుకోండి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవారిని, సంపాదన పెంచేవారిని ఎన్నుకోకపోతే ఎల్లకాలం పేదలు.. పేదలుగానే మిగిలిపోతారు. సినిమాల వల్ల, పత్రికల వల్ల అందరూ రాజకీయ దొంగలే అనుకుంటున్నారు. అయితే ప్రజలు ఒక్కటే ఆలోచించాలి. ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవరు మంచి చేస్తారు? సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎవరు అందిస్తున్నారు? ఎవరైతే పిల్లల విద్యపై దృష్టిపెట్టి వారిని బాగు చేస్తున్నారు? ఎవరైతే పెట్టుబడులు తీసుకొస్తారు? పరిశ్రమలను ఎవరు ప్రోత్సహిస్తారు? పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ చేసి, ఉపాధి అవకాశాలను ఎవరు పెంచుతారు? ప్రజారోగ్యంపై ఎవరు దృష్టిపెట్టారు? అనేది గమనించి వారికి మాత్రమే ఓటు వేసి ఆదరించండి. వాళ్లను మాత్రమే నమ్మండి’ అని జేపీ ప్రజలను కోరారు.