KTR | హైదరాబాద్ : ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ సందేశం ఇచ్చారు. నాడు జలదృశ్యం.. నేడు ఢిల్లీలో అద్వితీయ దృశ్యం ఆవిష్కృతమైంది. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదు.. తెలంగాణ ప్రజలకు సైతం గర్వకారణం. ఉద్యమ నాయకుడే.. ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం.. నేడు ఒక చారిత్రక అవసరం అని కేటీఆర్ పేర్కొన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పని చేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
నాడు ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా.. ఇప్పుడు దశాబ్దాలుగా దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టింది అని కేటీఆర్ తెలిపారు. ఉద్యమ పాఠాల నుంచి మొదలుకుని, యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. ఈ మహా ప్రస్థానంలో బీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమే. అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
గోల్మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదని దేశ ప్రజలు గ్రహించారు. గోల్డెన్ తెలంగాణ మోడల్ పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది అని కేటీఆర్ తెలిపారు. జాతీయ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ బలమైన ముద్ర వేయడం ఖాయం. బీఆర్ఎస్ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్న ప్రతి ఒక్క గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ సాధన కోసం ఏ సంకల్పంతో బయల్దేరామో అదే స్ఫూర్తితో దేశం కోసం కదం తొక్కాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.