హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): వేర్వేరు రాష్ర్టాల ప్రజలంతా హిందీలోనే మాట్లాడాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ‘ప్రియమైన అమిత్ షా గారు.. భిన్నత్వంలోనే ఏకత్వం మన బలం. భారతదేశం రాష్ర్టాల సమాఖ్య. అదే మన నిజమైన వసుధైక కుటుంబం. ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో మన దేశ ప్రజలు స్వేచ్ఛగా ఎందుకు నిర్ణయించుకోకూడదు! భాషాదురభిమానం, ఆధిపత్యం చెలాయించటం బూమరాంగ్ అవుతాయి. ముందుగా నేను భారతీయుడిని.
ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వాడిని. నేను నా మాతృభాష తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, కొంచెం కొంచెం ఉర్దూ మాట్లాడగలను. దేశంలో హిందీ మాత్రమే మాట్లాడాలి అనటం, ఇంగ్లిష్ భాషను నిషేధించటం లాంటి ప్రతిపాదనలు యువతకు తీవ్ర నష్టం చేస్తాయి’ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలపై హిందీని రుద్దే ప్రయత్నాన్ని కేరళ సీఎం విజయన్ కూడా వ్యతిరేకించారు. భారతదేశానికి ప్రత్యేకమైన ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ సంఘ్‌పరివార్ గుర్తించదని వ్యాఖ్యానించారు. ఏకత్వం పేరుతో ప్రాంతీయ భాషలను బలహీన పర్చడమే దాని ఎజెండా అని పేర్కొన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలు భారతదేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ‘భారతదేశానికే ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అదే పనిగా ప్రయత్నిస్తున్నది’ అని ఆరోపించారు. ‘దేశ ఐక్యతకు ఒకే భాష పనిచేయదు. దేశంలో ప్రజలందరినీ ఒకే గాటన కట్టడం ద్వారా ఐకమత్యాన్ని సాధించలేం’ అని వ్యాఖ్యానించారు. చేసిన తప్పే బీజేపీ మళ్లీ మళ్లీ చేస్తున్నదని, కానీ విజయం సాధించలేదని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ శుక్రవారం తమిళ తల్లి ఫొటోను, తమిళనాడు గీతాన్ని ట్వీట్ చేసి తన వ్యతిరేకతను ప్రకటించారు. ‘ప్రియమైన తమిళమే మన మనుగడకు మూలం’ అని పోస్టు చేశారు. ట్విట్టర్‌తో పాటు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ పోస్టు పెట్టారు. భాషా వివాదంపై రహమాన్ గతంలోనూ స్పందించారు.
బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే కూడా అమిత్ షా వ్యాఖ్యలను ఖండించింది. భాషను ప్రజలపై బలవంతంగా రుద్దవద్దని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ సీఎం, అన్నాడీఎంకే కోఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం అన్నారు. హిందీ కావాలనుకొంటే ప్రజలే స్వచ్ఛందంగా నేర్చుకొంటారని వ్యాఖ్యానించారు. #StopHindiImposition హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఈ హ్యాష్‌ట్యాగ్ శనివారం ట్రెండ్ అయింది.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్లో ‘ఎట్టకేలకు ప్రధాని మోదీ జీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నంబర్ 1గా నిలిచింది. కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్ పవర్ పారిటీ -పీపీపీ) డాలర్ అంచనా ఆధారంగా దేశంలో ఎల్పీజీ ధర ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. పెట్రోల్ ధరలో మూడో స్థానంలో, డీజిల్ ధరలో 8వ స్థానంలో ఉన్నది’ అని మోదీ సర్కారును ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ, ప్రధానిపై విరుచుకుపడ్డారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అన్నారు.. ఒక్కపైసా వేయలేదు. పెట్రోల్ ధరలు తగ్గుతాయని చెప్పారు.. గతంలో ఎప్పుడూ లేనంతగా పెంచుతున్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు.. ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకొంటుంటే వేడుక చూస్తున్నారు. ఇది మీ ఫెయిల్యూర్ మోదీ.. మీరు సాధించింది ఏదైనా ఉన్నదంటే అది నిత్యావసరాల ధరల పెరుగుదల మాత్రమే’ అంటూ ట్వీట్లు చేశారు.