భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే
రాష్ట్రంలో ఏఐపై లక్ష మందికి శిక్షణ: ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు
ట్రిపుల్‌ఐటీలో 3 ఏఐ ప్రాజెక్టుల ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): సామాన్యులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరువ కావాలన్నదే సీఎం కేసీఆర్ కోరికని, దాన్ని నిజం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులు, కంపెనీలు నిరంతరం పనిచేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పలు ప్రాజెక్టులను చేపడుతున్నదని, ప్రైవేటు సంస్థలు జత కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మంగళవారం గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ప్-ఏఐ) ఆధారంగా పనిచేసే మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో రోడ్డు ప్రమాదాలను ముందే పసిగట్టి అప్రమత్తం చేసే సాంకేతికత ప్రాజెక్టు ఐరాస్తే తెలంగాణ, కారులో రక్షణ వ్యవస్థలను పరిపుష్టం చేసే బోధ్యాన్, జెనోమిక్ విభాగానికి చెందిన మైక్రోల్యాబ్స్ను ట్రిపుల్ ఐటీలోని కృత్రిమ మేధ సాంకేతికత ఆధారంగా చేపట్టనున్నారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టెక్నాలజీ పరంగా గత పదేండ్లలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, సామాన్యునికి ఉపయోగపడే ప్రాజెక్టులను చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి ఏఐ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏఐ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం 2020 ఏడాదిని ఇయర్ ఆఫ్ ఏఐగా పకటించిందని గుర్తుచేశారు. ప్రభుత్వశాఖల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేసేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ నిరంతరం పనిచేస్తున్నదని తెలిపారు. ఇటీవలే వ్యవసాయ డాటా నిర్వహణపై ప్రభుత్వం పాలసీ రూపొందించిందని పేర్కొన్నారు. గార్ట్నర్స్-2022 సీఈవో సర్వే ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో ఏఐ ఒకటిగా ఉన్నదని వెల్లడించిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం ఏఐ దేశ జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్)ను 1.3 శాతం పెంచుతుందని, 2035 నాటికి దేశఆర్థిక వ్యవస్థ 957 బిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పారు. దేశంలో ఎన్నో ఐఐటీ విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాటి కంటే మిన్నగా పనితీరు కనబరుస్తున్నదని కొనియాడారు.
ట్రిపుల్ ఐటీలో చేపట్టే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణ్, ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి, ఉబెర్ ప్రతినిధి సూరజ్నాయర్, ఐటీశాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి, టీఎస్ఆర్టీసీ ప్రతినిధి సీ వినోద్‌కుమార్, ఐజీఐబీ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ హేమంత్ కే గౌతం, ఐఎన్ఎఐ సీఈవో వర్మ కొనాల, ఐ హబ్ హెడ్ పీదేవ తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రారంభం
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌లో మరొ కొత్త ఐటీ సంస్థ ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ మహానగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు హబ్‌గా, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు నిలయంగా మారిందని చెప్పారు. అత్యాధునిక మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డాటా విషయంలో భారతదేశం తమకు కీలకమైన మార్కెట్ అని, హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు ద్వారా ఎన్నో సేవలను అందించేందుకు అవకాశం కలుగుతుందని ఎక్స్పీరియన్ ఇండియా కంట్రీ మేనేజర్ నీరజ్ ధావన్ చెప్పారు. కార్యక్రమంలో ఎక్స్పీరియన్ ఇండియా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జాక్ సైమండ్స్ తదితరులు పాల్గొన్నారు.