ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 12:40:09

దుర్గంధం నుంచి శాశ్వ‌త విముక్తి : మ‌ంత్రి కేటీఆర్

దుర్గంధం నుంచి శాశ్వ‌త విముక్తి : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌, ద‌మ్మాయిగూడ ప్ర‌జ‌ల‌కు దుర్గంధం నుంచి శాశ్వ‌త విముక్తి క‌ల్పించేందుకు వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. న‌గ‌రంలోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్‌ వ్యర్థాలతో విద్యుత్‌(వేస్ట్‌ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం.  

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ ప్లాంట్‌ను అత్యాధునిక టెక్నాల‌జీతో నిర్మించిన‌ట్లు తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలో ప్ర‌తి రోజు 5 వేల‌ నుంచి 6 వేల ట‌న్నుల చెత్తను సేక‌రించి.. దాన్ని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. దీనివ‌ల్ల స్థానిక ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గుర్తించి, ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేశారు. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌, దమ్మాయిగూడ ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌తంగా విముక్తి కల్పించేందుకు వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అనుమ‌తి ఇచ్చారు. 19.8 మెగావాట్ల ప్లాంట్‌ను ఇవాళ ప్రారంభించ‌నుకున్నాం. 1200 ట‌న్నుల చెత్త‌ను విద్యుత్ ఉత్ప‌త్తికి ఉప‌యోగిస్తున్నాం. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో గుట్ట‌లుగా పేరుకుపోయిన చెత్త‌ను రూ. 147 కోట్ల‌తో క్యాపింగ్ చేసి సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నాం. స్థానిక ప్ర‌జ‌ల‌కు ఎలాంటి దుర్గంధం, మురికి వాస‌న లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. 

ఇప్పుడున్న విద్యుత్ ప్లాంట్‌కు అద‌నంగా మ‌రో 28 మెగావాట్ల ప్లాంట్‌కు శిలాఫ‌లకం వేశామ‌న్నారు. ఈ ప్లాంట్‌ను 18 నెల‌ల్లో పూర్తి చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుత‌మున్న జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డును వికేంద్రీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రో రెండు ప్రాంతాల్లో సంగారెడ్డి జిల్లా ల‌క్డారంలో, మెద‌క్ జిల్లా ప్యారేన‌గ‌ర్‌లో స్థ‌లాల‌ను ఎంపిక చేశాం. జ‌నావాసాల‌కు దూరంగా డంపింగ్ యార్డుల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నాం. శాస్ర్తీయ‌మైన ప‌ద్ధ‌తిలో వీటిని పూర్తి చేస్తాం. త్వ‌ర‌లోనే ఈ డంప్‌యార్డుల‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.