హైదరాబాద్ సిటీబ్యూరో/నిజామాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖలీల్‌వాడీ: కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భూములు గుంజుకునేందుకు కేసీఆర్ వస్తున్నడు అంటూ కాంగ్రెస్ నేత అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 70 ఏండ్ల వయసులో కామారెడ్డిలో పేద రైతు భూమి గుంజుకునే ఆలోచన కేసీఆర్‌కు ఎందుకుంటుందని ప్రశ్నించారు.
కాంగ్రెసోళ్లు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరం కాదు. గుంట కాదు. గజం కాదు. ఇంచు భూమి కూడా ఎవ్వరిదీ పోదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీపోళ్లు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, వాళ్ల గురించి పట్టించుకోవద్దని సూచించారు. కేసీఆర్ రాకతో ఇక్కడి ప్రజలకు ఉల్టా లాభం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకే లాభమని చెప్పారు. శనివారం హైదరాబాద్, కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూర్‌లో, నిజామాబాద్ నగరంలో నిర్వహించిన రోడ్‌షోలలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు.. మీ దయతో, ప్రేమతో, ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని నడుపుతున్నారని తెలిపారు. విజయవంతంగా తెలంగాణను అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను నాన్ లోకల్ అంటున్న బీజేపీ అభ్యర్థే నాన్ లోకల్ అని చెప్పారు. ఎల్లారెడ్డికి చెందినోడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను నాన్ లోకల్ అంటున్నారని, కేసీఆర్ తెలంగాణ అంతటా లోకల్ అని స్పష్టంచేశారు. కేసీఆర్ అమ్మ గారిది ఇక్కడే కోనాపూర్ అని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన కేసీఆర్ లోకల్ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి తీరు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు.
కొడంగల్‌లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా? కొడంగల్‌లో అమ్ముడుపోని ఎద్దు కామారెడ్డి అమ్ముడుపోతుందా? బాగా బలిసిన కోడి.. చికెన్ సెంటర్ ముందుకు వచ్చి తొడ కొట్టినట్టు కామారెడ్డికి వచ్చి కేసీఆర్‌పై రేవంత్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మూడో స్థానం తథ్యం.
– మంత్రి కేటీఆర్
Ktr
ఏడాదిలోగా గోదావరి నీళ్లు..
ఏడాదిలోనే గోదావరి నీళ్లతో కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కాళ్లు కడుగుతామని కేటీఆర్ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీతో గల్ఫ్‌లో ఉంటున్న వారిని ఆదుకుంటామని, గల్ఫ్ బాధితులకు బీమాను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారని వివరించారు. సౌభాగ్యలక్ష్మి పేరిట 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. బీడీ కార్మికులకు కటాఫ్ పెంచాలని అంటున్నారని, జనవరిలో కటాఫ్ పెంచి ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములుంటే వారికి డిసెంబర్ 3 తర్వాత అసైన్డు భూములున్న వారికి పట్టాలిచ్చి హక్కులు కల్పిస్తామని చెప్పారు.
ఆ భూమిపై పూర్తి అధికారం ఉం టుందని, అమ్ముకోవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు అని వివరించారు. ఈ ఎన్నికల్లో ఎట్లాగో గెలిచేది కేసీఆరే అని, తప్పకుండా ప్రజలంతా గెలిపిస్తారని పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో సిలిండర్ చూసి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చిన మోదీ.. అదే సిలిండర్ ధరను రూ.800 పెంచి రూ.1,200 చేశారని మండిపడ్డారు. మోదీ హయాంలో కట్టెల పొయ్యిలే దిక్కు అయ్యాయని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.400కే సిలిండర్ అందిస్తుందని, మిగిలిన రూ.800 భారాన్ని కేసీఆరే భరిస్తారని చెప్పారు. జనవరిలో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రైతుబీమా మాదిరిగా కేసీఆర్ బీమా పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు భూమి ఉన్నా, లేకున్నా రూ.5 లక్షల జీవిత బీమా అందించబోతున్నట్టు వెల్లడించారు.
కేసీఆర్ రాకతో కామారెడ్డి దశ మారుతుంది. ఐదేండ్లలో దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా కామారెడ్డి నిలుస్తుంది.
– మంత్రి కేటీఆర్
రాహుల్, మోదీ ప్లాన్ ఒక్కటే..
కేసీఆర్‌ను తెలంగాణలో గెలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో జెండా పాతుతారనే భయం తో రాహుల్, మోదీలు ఇక్కడ కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. మోదీ, యోగి, 15 మంది కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షులు, రాహుల్, డీకే ఇంత మంది వస్తున్నారంటే వాళ్ల భయం ఒక్కటేనని పేర్కొన్నారు. 3వ సారి గెలిస్తే ఢిల్లీ వస్తాడు.. జెండా పాతుతాడు అని భయం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టుకున్నదని వివరించారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ గొంతును నొక్కాలని మోదీ-షా చూస్తున్నారని మండిపడ్డారు. కానీ తాము వారికి భయపడబోమని స్పష్టం చేశారు. అవసరమైతే తల నరుక్కుంటాం కానీ ఢిల్లీ వాళ్లకు తలవంచమని స్పష్టం చేశారు. బీజేపీని, మోదీని ఢీకొట్టే దమ్ము కేవలం సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పారు.
తెలంగాణకు సింహం లాంటోడు కేసీఆర్
తెలంగాణకు సింహం లాంటి వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్క కేసీఆర్ గొంతు నొక్కేందుకు ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లాంటి వారు వస్తున్నారని, గుంపులు, గుంపులుగా ఎంత మంది వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రజలే తమకు బలమని వెల్లడించారు. సింహం లాంటి సీఎం కేసీఆర్ ఉండగా.. సీల్డ్ కవర్లో వచ్చే సీఎంలు మనకు ఎందుకు అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేండ్లలో ఎలాంటి కరువు, కర్ఫ్యూ లేకుండా పాలన సాగించామని, అభివృద్ధి మీ కండ్ల ముందే ఉన్నదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మూడు రోజులకోకసారి కర్ఫ్యూలు, బంద్‌లు ఉండేవని గుర్తు చేశారు.
కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్‌లో చెల్లుతుందా?
కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్‌లో చెల్లుతుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పొరపాటున షబ్బీర్ అలీ గెలిస్తే.. ఆయనతో పని పడితే ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. గణేశ్‌గుప్తాను మరోసారి ఆశీర్వదించాలని, ఆయన ఎప్పు డూ అందుబాటులో ఉంటారని చెప్పారు. గణేశ్ బిగాల చేసిన అభివృద్ధి కండ్ల ముందే ఉన్నదని, అభివృద్ధిని చూసి గణేశ్ బిగాలను గెలిపిస్తే నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని వెల్లడించారు.
గోషామహల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పథంలోకి తీసుకొస్తా. తొమ్మిదిన్నరేండ్లలో ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. ప్రజా సమస్యలపై ఆయనకు ఆసక్తి లేదు. బేకార్ ముచ్చట్లు.. పంచాయితీ పెట్టడమే రాజాసింగ్‌కు అలవాటు.
– మంత్రి కేటీఆర్
గోషామహల్‌ను అభివృద్ధి చేస్తా
హైదరాబాద్ ప్రశాంతతను ఎవరూ చెడగొట్టాలని ప్రయత్నించినా ఊరుకోలేదని, రాజాసింగ్‌ను సైతం జైళ్లో పెట్టించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు ఎవరూ లేరని, యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని వివరించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న గోషామహల్‌ను అన్ని విధాలా అభివృద్ధి బాధ్యత తనదేనని, బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌ను గెలిపిస్తే ఐదేండ్లలో నియోజకవర్గానికి సేవ చేస్తానని హామీ ఇచ్చారు.
ధూల్‌పేటలో చాలా మంది కళాకారులు ఉన్నారని, గణేశ్, దుర్గామాత విగ్రహాలు తయారు చేసే 200 మంది కార్మికులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందిస్తామని చెప్పారు. మలక్‌పేటలో టీవీ టవర్‌ను మరిపించేలా ఐటీ టవర్‌ను తీసుకువస్తామని, ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ వరకు మెట్రోను పూర్తి చేస్తామని వెల్లడించారు. నాగోల్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. ఆయా రోడ్ షోలలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, అభ్యర్థులు బిగాల గణేశ్ గుప్తా, తీగల అజిత్‌రెడ్డి, నందకిశోర్ వ్యాస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జి దాసోజు శ్రవణ్, సీనియర్ నేతలు తీగల కృష్ణారెడ్డి, మోతె శోభన్‌రెడ్డి, చలపతిరావు, ఆర్వీ మహేందర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ వచ్చి మైనార్టీలు పేదవాళ్లు అంటున్నారు. 55 ఏండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? 11 సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మైనార్టీలకు ధోకా చేశారు.
– మంత్రి కేటీఆర్
ఉద్యమానికి పురుడు పోసిన గడ్డ ఇది
రేవంత్‌రెడ్డి భిక్కనూర్‌కు వచ్చి కేసీఆర్‌ను బూతులు తిట్టుడు.. నోటికొచ్చినట్టు ఒర్రుడు తప్ప చేసేది ఏమీ లేదని దుయ్యబట్టారు. పైసలిచ్చి కొనుడు అలవాటైన వ్యక్తి రూ.50 లక్షల డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. సర్పంచ్‌లు, జడ్పీటీసీలను కొన్నంత మాత్రాన ఓటర్ల మనసులను కొనలేరని స్పష్టంచేశారు. బిడ్డా యాదికి పెట్టుకో.. ఉద్యమానికి పురుడు పోసిన గడ్డ.. ఏకగ్రీవాలతో బీఆర్ఎస్కు పురుడు పోసిన గడ్డా కామారెడ్డి అని చెప్పారు. వ్యవసాయానికి 3 గంటలు విద్యుత్తు అంటున్న రేవంత్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ధరణి ఎత్తేసి పట్వారీ వ్యవస్థ తెస్తామని భట్టి విక్రమార్క చెప్తున్నారని వివరించారు. ఒక్క చాన్స్ అంటున్న కాంగ్రెస్‌కు 11 చాన్సులు ఇచ్చామని, మళ్లా ఆ దరిద్రం రావాల్నా అంటూ ప్రజలను ప్రశ్నించగా వద్దంటూ బదులిచ్చారు.