కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నేపాల్‌లో నైట్‌క్లబ్బులు, పబ్బుల్లో ఎంజాయ్ చేసినట్టు నేను చేయలేదు. దావోస్‌కు వెళ్లి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించా. దావోస్‌కు వెళ్లడం అనేది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తా.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కూడా అధికంగా నిధులు ఇచ్చే విధానం బీఆర్ఎస్ సర్కారుది అని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు విపక్ష రాష్ర్టాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధికి కేంద్రం కనీస స్థాయిలో కూడా నిధులు ఇవ్వటం లేదని తెలిపారు. హైదరాబాద్‌కు తెలంగాణ సర్కారు ఖర్చు చేసిన నిధుల్లో ఒక శాతం మాత్రమే కేంద్రం ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పద్దుపై జరిగిన చర్చకు శాఖ మంత్రి కే తారకరామారావు సమాధానమిస్తూ.. మున్సిపల్ శాఖలో పని థాంక్ లెస్ జాబ్ అని అన్నారు. ఇక్కడ ప్రతి రోజూ పనిచేసినా అభినందించే వారు ఒక్కరూ ఉండరని, కానీ ఒకటి, రెండు రోజులు పనిచేయకుంటే, వీధులు శుభ్రం చేయకుంటే, మురుగు కాలువలు క్లీన్ చేయకుంటే మాత్రం అందరూ తిడతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇస్తే 396 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఉన్న మహారాష్ట్రకు 27 అవార్డులు వస్తే 142 పట్టణ స్థానిక సంస్థలు ఉన్న తెలంగాణకు 26 అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు.
మున్సిపాలిటీల్లో 15 వేల కోట్ల ఖర్చు
ఎనిమిదేండ్లలో హైదరాబాద్ మినహా 141 మున్సిపాలిటీల్లో మున్సిపల్ శాఖ ద్వారానే రూ.15,090 కోట్లు ఖర్చు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 141 మున్సిపాలిటీలకు కేంద్రం రూ.1,690 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు రూ.39,425 కోట్లు మున్సిపల్ శాఖ ద్వారా ఖర్చు చేస్తే, కేంద్రం నుంచి రూ.520 కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. గుజరాత్లో వరదలు వస్తే రూ.1,000 కోట్లు ఇచ్చిన ప్రధాని మోదీ, హైదరాబాద్‌లో వరదలు వస్తే ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు. మన రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కుర్కురే ప్యాకెట్లు పంచారని మంత్రి ఎద్దేవా చేశారు. కాగా, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలకు కూడా బాధ్యత ఉండాలని, తమ పట్టణం, తమ నగరం అనుకుంటేనే పారిశుద్ధ్య సమస్యకు సంపూర్ణ పరిష్కారం దొరుకుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నారాయణపేటలో సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశామని, అది పార్లమెంట్ భవనం తరహాలో ఉన్నదని చెప్పారు.
అడగకుండానే జీతాలు పెంచాం
శానిటేషన్ ఉద్యోగులకు ఇప్పటి వరకు మూడు సార్లు వేతనాలు పెంచామని, జీతాలు పెంచాలని అడగకముందే, ధర్నాలు చేయకముందే వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది అని కేటీఆర్ స్పష్టం చేశారు. మెప్మా ఉద్యోగులకు కూడా పే స్కేల్ ఇస్తామని ప్రకటించారు. దేశంలో వందకు వంద శాతం సీవరేజ్ నీటిని శుద్ధి చేస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ అని, వచ్చే జూన్ నాటి కల్లా ఎఫ్ఎస్టీల పనులన్నీ పూర్తవుతాయన్నారు.
మీకు మాకు పోలికా?
కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క వ్యవహరం మా తాతలు నేతులు తాగారు మేము మూతులు నాకుతాం అన్నట్టు ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ 55 ఏండ్లు పాలిస్తే, బీఆర్ఎస్ 8 ఏండ్లే పాలించిందని, అలాంటప్పుడు ‘మీకు మాకు పోలిక ఎలా? ఉంటుంది’ అని ప్రశ్నించారు.
మీ మాజీ అధ్యక్షుడిలా క్లబ్బులకు వెళ్లలేదు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నేపాల్‌లో నైట్‌క్లబ్బులు, పబ్బులకు వెళ్లినట్టుగా తాను చేయలేదని రాహుల్ గాంధీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను దావోస్‌లో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించానని, దావోస్‌కు పోవడం అనేది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా తాను భావిస్తానని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీలకు కూడా పెద్దఎత్తున నిధులు ఇచ్చామని గుర్తుచేశారు. ‘మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి దళితబంధు కింద రూ.400 కోట్లు ఇచ్చాం. ములుగును జిల్లాను చేశాం. మధిర మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, మంథని మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, సంగారెడ్డి, సదాశివపేటకు రూ.35 కోట్ల చొప్పున, దుబ్బాక మున్సిపాలిటీకి రూ.30 కోట్లు ఇచ్చాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రం పైసా ఇవ్వడం లేదు
ఎస్ఆర్డీపీలో భాగంగా హైదరాబాద్ నలువైపులా 48 అండర్ పాస్‌లు, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు నిర్మించామని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు ఉత్తమాటలతో రాలేదని, దాని వెనుక ఎంతో కృషి ఉన్నదని తెలిపారు. ప్రతి పట్టణంలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని, వ్యర్థాల నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నామని, రూ.260 కోట్లతో ప్లాంట్ పెడుతున్నామని వివరించారు. జవహర్‌నగర్‌లో వేస్ట్ టు ఎనర్జీ 20 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 220 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశామని చెప్పారు. మరో 48 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. 100 మెగావాట్ల యూనిట్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రూ.985 కోట్లతో నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టామని, 90 శాతం పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. కేంద్రం మాత్రం ఒక్క పైసా కేటాయించడం లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా ఈటల రాజేందర్ చూడాలని కోరారు.