ఎవరి పాలన అరిష్టం ఈ దేశానికి? ఈటల రాజేందర్ పార్టీ బీజేపీ 2014లో ఎన్ని మాటలు చెప్పింది? ప్రజలు జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే, ధనాధన్ 15 లక్షలు ఆ ఖాతాలలో వేస్తానని మోదీ చెప్పిండు. ఏమైనయ్ ఆ 15లక్షలు? ఎవరికి పోయినయ్? అవన్నీ ఒక్కడి ఖాతాలనే పడ్డయ్. వాడు ప్రపంచంలోనే కుబేరుడై కూసున్నడు. ఆ ఒక్కడే బాగుపడ్డడు. దేశం మొత్తం బాగుపడ్డదని బీజేపోళ్లు చెప్తున్నరు. మోదీ ప్రాపకం వల్ల దొంగ సొమ్ము, మందిసొమ్ము తిని అదానీ అనేటోడు ఒక్కడే బాగుపడ్డడు. మోదీ మస్తు మాటలు చెప్పిండు. 2022 కల్లా ఇండ్లు లేని పేదోళ్లందరికీ ఇండ్లు ఇస్తానన్నడు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్నడు. ఇంటింటికి నల్లాపెట్టి నీళ్లిస్తా అన్నడు. కరెంటు లేని ఊరుండదన్నడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని కూడా చెప్పిండు. అమెరికావాళ్లే వచ్చి వీసాల కోసం క్యూ కట్టేలా 2022కల్లా భారతదేశాన్ని భూతల స్వర్గం చేస్తానన్నడు. 2022 అయిపోయి 2023కు వచ్చినం. జరిగినయా ఏమైనా? మోదీ పాలనే దేశానికి అరిష్టం.
ఈటల, బండి ఇలాకాలో బీఆర్ఎస్ సభ దుమ్మురేపింది. జమ్మికుంట నడిబొడ్డున జనప్రభంజనం మధ్య నిలబడి రణగర్జన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడ్డాక హుజూరాబాద్ నియోజకవర్గంలో తొలిసారి పర్యటించిన ఆయన.. ఒకవైపు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలపై మాటల తూటాల్ని పేల్చారు. బీజేపీ రాష్ట్ర నేతలు చేస్తున్న డొల్ల ప్రచారాలనూ కేటీఆర్ చీల్చిచెండాడారు. బీజేపీ నేతలు మాయమాటలతో మళ్లీ మన ముందుకు వస్తారని, ఈ సారి మోసపోవద్దని హుజూరాబాద్ ప్రజలను హెచ్చరించారు. కేటీఆర్ మాటలకు అడుగడుగునా సభకు హాజరైన జనం ప్రతిస్పందించారు. గత తప్పిదమే మళ్లీ చేస్తరా? అని ఆయన ప్రశ్నించినప్పుడు.. చేయబోమంటూ వారంతా చప్పట్లతో సంఘీభావం తెలిపారు.
కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌తో కలిసి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. నగరంలో నిర్మించిన సర్క్యూట్ రెస్ట్‌హౌస్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో బీజేపీ పాలనపై, ఆ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. దేశ ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులతో మోదీ ఏం చేశారని, బయటినుంచి తెస్తున్న అప్పులతో దేశానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశంలో ఒక్క అదానీ మాత్రమే బాగుపడ్డాడని స్పష్టం చేశారు. ఈటల సానుభూతి మాటలకు మోసపోవద్దని హుజూరాబాద్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
గత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నో హామీలు ఇచ్చాడని, అందులో ఏమైనా చేశాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో నిధుల వరద పారిస్తామని, డబుల్ ఇంజిన్‌తో అభివృద్ధి చేస్తామని చెప్పిన ఆయన 14 నెలల్లో దమ్మిడీ పైసా అయినా తెచ్చి అభివృద్ధి చేశారా? అని నిలదీశారు. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అన్నట్టుగా ఈటల మాటలు కోటలు దాటినా.. చేతలు మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ గడ్డ మీద మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసం ఈ బహిరంగ సభను చూసిన తర్వాత తెలిసి వచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లారిలేస్తే చిల్లరమాటలు మాట్లాడుతున్నడు. మసీదులు తవ్వుదాం అంటడు. శవం వెళ్తే మీది.. శివం వెళ్తే మాది అంటడు. ఇందుకా ఆయనను ఎంపీని చేసింది? హుజూరాబాద్‌లో కాలువల కోసం పునాదులు తవ్వుదాం. దమ్ముంటే రా? హుజూరాబాద్‌లో కొత్త పరిశ్రమలు పెట్టేందుకు పునాదులు తవ్వుదాం. దమ్ముంటే రా? హుజూరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పునాదులు తవ్వుదాం. దమ్ముంటే రా. మోదీని ఒప్పించి నాలుగు పైసలు తీసుకొనిరా. అవేవీ శాతగాదు.
ఈటల రాజేందర్ నెలరోజుల కింద మాట్లాడిన మాటలు తనకు చాలా బాధ కలిగించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ర్టానికి అరిష్టం పట్టిందంటూ విజ్ఞత లేకుండా మాట్లాడారని అన్నారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఉన్నడని హుజూరాబాద్‌కు పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘2004లో 33 మంది పోటీ పడితే, రాజకీయ అనుభవం లేకపోయినా రాజేందర్‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. కానీ, ఈ రోజు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు తండ్రిలాంటి కేసీఆర్‌ను పట్టుకొని ఆయన పాలన అరిష్టం అని అనవచ్చునా? రాజకీయంగా దారులు వేరుగావొచ్చు. కానీ రాజకీయ జన్మనిచ్చిన పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్‌ను పట్టుకొని నియ్యత్ లేకుండా మాట్లాడుతున్నడు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎవరి పాలన అరిష్టం ఈ దేశానికి? ఈటల రాజేందర్ పార్టీ బీజేపీ 2014లో ఎన్ని మాటలు చెప్పింది? ప్రజలు జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే, ధనాధన్ 15 లక్షలు ఆ ఖాతాలలో వేస్తానని మోదీ చెప్పిండు? ఏమైనయ్ ఆ 15 లక్షలు? ఎవరికి పోయినయ్? అవన్నీ ఒక్కడి ఖాతాలనే పడ్డయ్. వాడు ప్రపంచంలోనే కుబేరుడై కూసున్నడు. మందిసొమ్ము తిని అదానీ అనేటోడు ఒక్కడే బాగుపడ్డడు. మోదీ మస్తు మాటలు చెప్పిండు. 2022 కల్లా ఇండ్లు లేని పేదోళ్లందరికీ ఇండ్లు ఇస్తానన్నడు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్నడు. ఇంటింటికి నల్లాపెట్టి నీళ్లిస్తా అన్నడు. కరెంటు లేని ఊరుండదన్నడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని కూడా చెప్పిండు. అమెరికావాళ్లే వచ్చి వీసాల కోసం క్యూ కట్టేలా 2022కల్లా భారతదేశాన్ని భూతల స్వర్గం చేస్తానన్నడు. 2022 అయిపోయి 2023కు వచ్చినం. జరిగినయా ఏమైనా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ సీటు ఇప్పించినందుకు ఆయనకు మోదీ దేవుడు కావచ్చు గానీ, ప్రజలకు ఆయన ఏం చేశాడని ప్రశ్నించారు. ‘గ్యాస్ ధరలు రూ.400 నుంచి రూ.1,200 పెంచినందుకు మధ్యతరగతి మహిళలకు దేవుడా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఈ దేశ యువతను మోసం చేసినందుకు దేవుడా? పప్పులు, ఉప్పులు, నూనె, చింతపండు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచినందుకు దేవుడా? 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.70, ముడి చమురు ధర బ్యారల్‌కు 90 డాలర్లు. ముడి చమురు ధర ఇప్పుడు కూడా 90 డాలర్లు మాత్రమే ఉన్నా పెట్రోల్ ధర రూ.119కి పెంచినందుకు మోదీ దేవుడా? అడ్డగోలుగా సెస్సులు వేసి దేశ ప్రజల నుంచి బలవంతంగా రూ.30 లక్షల కోట్ల పన్నులు పిండినందుకు ఆయన దేవుడా? కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు.. పేదలను దోచి పెద్దలకు పెడుతున్న మోదీ ఎవరికి దేవుడు? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మోదీ దేవుడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అంటున్నడు. ఎవరికి దేవుడు మోదీ? ఆడబిడ్డలు ఆలోచించాలె. రూ.400 సిలిండర్‌ను 1,200 చేసినోడు దేవుడా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి, 8 ఏండ్లుగా ఈ దేశ యువతను మోసం చేస్తున్నందుకు 30 ఏండ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం. 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం. ఆకాశంలో అప్పులు.. పాతాళంలో రూపాయి. ఇందుకే నరేంద్ర మోదీ దేవుడా?
– మంత్రి కేటీఆర్
దేశంలో 1952 నుంచి 2014 వరకు 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధానిగా మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేశాడని కేటీఆర్ మండిపడ్డారు. దేశ ప్రజల మీద బలవంతంగా వేసిన రూ.36 లక్షల కోట్ల పన్నులు, తీసుకువచ్చిన రూ.100 లక్షల కోట్ల అప్పులు ఎటు పోయాయని, ఏమయ్యాయని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘జాతీయ రహదారులు వేస్తున్నామని, ఎయిర్ పోర్టులు కడుతున్నామని బండి సంజయ్ చెబుతున్నాడు. మరి జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు భూములు ఇస్తే.. ప్రైవేట్ కంపెనీలు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాయి. కేవలం అనుమతులు ఇచ్చి విమానాశ్రయాలను మేమే కడుతున్నామని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లారిలేస్తే చిల్లరమాటలు మాట్లాడుతున్నడు. మసీదులు తవ్వుదాం అంటడు. ఇందుకా ఆయనను ఎంపీని చేసింది? హుజూరాబాద్‌లో కాలువల కోసం పునాదులు తవ్వుదాం. దమ్ముంటే దా! హుజూరాబాద్‌లో కొత్త పరిశ్రమలు పెట్టేందుకు పునాదులు తవ్వుదాం. దమ్ముంటే దా! మోదీని ఒప్పించి నాలుగు పైసలు తీసుకొనిరా! అవేవీ శాతగాదు. గట్టిగా మాట్లాడితే మ్మెమ్మెమ్మె..బ్బెబ్బెబ్బె.. హిందూ-ముస్లిం, హిందుస్థాన్-పాకిస్థాన్.. ఇవితప్ప ఏం శాతగాదు. నాలుగున్నరేండ్లలో బండి సంజయ్ ఎంపీగా, ఈ 14 నెలల్లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఒక్క పైసా పనైనా హుజూరాబాద్‌కు చేసిండ్రా? శాతనైతే హుజూరాబాద్‌కు ఓ కేంద్రీయ విద్యాలయం తీసుకునిరావాలె. ఒక నవోదయ పాఠశాలనో, ట్రిపుల్ఐటీనో కరీంనగర్‌కు తీసుకుని రావాలె’ అని కేటీఆర్ సవాల్ చేశారు.
టీఆర్ఎస్ పార్టీ మారలేదని, మారింది కేవలం పేరు మాత్రమేనని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికీ మన జెండా, ఎజెండా ఒక్కటేనని చెప్పారు. దేశ మంతటా విస్తరించేందుకు బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నా డీఎన్ఏ మారలేదన్నారు. దేశం కోసం దేవుడితోనైనా కొట్లాడుతమని స్పష్టంచేశారు. ‘ఎట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడుండాలె అని పెద్దోళ్లు అంటరు. తెలంగాణలో మనపార్టీ అంటే భారత రాష్ట్ర సమితే తప్ప. గుజరాతోళ్ల పార్టీ కానేకాదు. వాళ్లకు గులాంగిరీ చేసుట్ల బండి సంజయ్‌కు సోకుండొచ్చు. గుజరాతోళ్ల చెప్పులు నెత్తిమీద పెట్టుకునే అలవాటు ఆయనకు ఉండొచ్చు. కానీ, రేషంగల్ల కరీంనగర్ బిడ్డలకు, అందులోనూ జమ్మికుంట బిడ్డలకు లేనేలేదు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్లు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, గందె రాధిక, బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ రాకతో జమ్మికుంట ప్రాంతం పులకించింది. ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచి 14 నెలలైంది. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా.. ఇప్పటి వరకు ఒక్క పైసన్నా తెచ్చిండా? దొంగ ఏడ్పులు తప్ప ఏం చేయలె? ఏం చేయాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యం. ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గం కళకళలాడేది. అయినా, అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నం. 2001లో మా నాన్న గులాబీ జెండా పట్టుకుని కేసీఆర్ సభ పెట్టిండు. ఇప్పుడు నేను కేటీఆర్‌ను తెచ్చుకున్న. జెండా పట్టుకున్న. కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో మీ ముందు నిలబడుత. అందరి సహకారంతో గులాబీ జెండా ఎగురేస్తం.
– ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి
నేను రాజకీయాల్లో 40 ఏండ్లుగా ఉన్న. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. ఎందరో ముఖ్యమంత్రులను చూసిన. కానీ, అందరిలో ఒక్క కేసీఆరే దమ్మున్న నేత. బీజేపీ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నరు. వాళ్లు పాలిస్తున్న రాష్ర్టాలకు వెళ్లి చూస్తే అభివృద్ధి ఏమున్నదో కనిపిస్తది. రాజకీయ జీవితాన్ని ఇచ్చి, మంత్రిగా అవకాశం ఇచ్చిన పెద్ద మనిషిని మోసం జేసేటోన్ని మాత్రం వదిలి పెట్టకున్రి. గెలిచిన బండి సంజయ్, ఈటల ఏం పగుల గొడ్తున్నరు? ఒక్క పైసా తేలే. అభివృద్ధి దిక్కు చూడలే. ఎందుకీ బీజేపీ? తరిమి తరిమి కొట్టాలే.
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రతి పేదింటి బిడ్డ చదువుకోవాలని సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసిండ్రు. బీసీ బిడ్డలంతా ఉచిత విద్యనందుకుంటున్నరు. కానీ, కేంద్రం బీసీ బిడ్డలకు నిధులెందుకు ఇవ్వడం లేదో చెప్పాలె. కేంద్ర ప్రభుత్వంలో బీసీ శాఖ లేనే లేదు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు దమ్ముంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ శాఖ కోసం బిల్లు ప్రవేశపెట్టాలి. బీసీ బిడ్డలమని చెప్పుకొంటున్న ఈటల, బండిలిద్దరూ బీసీలకు న్యాయం చేయలే. బీసీలకు న్యాయం చేస్తే నా చేత్తో బంగారు కడియం తొడుగుత. లేకుంటే దోషుల్లా నిలబెడతం.
– మంత్రి గంగుల కమలాకర్
బీజేపీ కేంద్రంలోకి వచ్చి తొమ్మిన్నరేండ్లయ్యింది. కాంగ్రెస్ ఏన్నో ఏండ్లు పాలించింది. దేశానికి వాళ్లు చేసిందేమీ లేదు. దేశాన్ని అవినీతిమయంగా చేసిన మోదీ.. తనకెవరూ లేరని చెప్తూనే ప్రజలను వంచిస్తున్నడు. ఆయనకు చాలా పెద్ద కుటుంబం ఉన్నది. వాళ్లెవరో తెలుసా? అదానీ, అంబా నీ. మనం బ్యాంకుల్లో పెట్టుకున్నవన్నీ దోపిడీ చేసి వాళ్లకు అప్పనంగా పెడ్తున్నడు. బండి సంజయ్ నీవు మా నాయకుడు కేసీఆర్‌ను జైళ్లో పెడ్తానన్నావ్ కదా.. ఇయ్యాల మోదీ చేసిన పనికి ఏం చేస్తావ్? అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టు. విచారణ చేద్దాం. రూ.12 లక్షల కోట్లు దోపిడీదార్లకు కట్టబెట్టింది నిజం కాదా? మా రైతులు లక్ష రుణం తీసుకుంటే విపరీతమైన వడ్డీ వేస్తున్నరు. మా ఆస్తులు జప్తు చేస్తున్నరు కదా.. నువ్వెందుకు వీటి మీద మాట్లాడవ్. దేశ రాజకీయాలు మార్చేందుకే బీఆర్ఎస్ పెట్టినం. అన్ని వర్గాలను సుఖసంతోషాలతో గొప్పగా బతికేలా తీర్చిదిద్దుతం.
-బీ వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు