KTR | నిజామాబాద్ : ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే నాయకులను నమ్మొద్దని ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సంచలన నాయకుడా కావాలా.. సంచులు మోసే దరిద్రుడా కావాలా.. ఎవరు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఇవాళ రాష్ట్రంలో పోటీ ఎవరి మధ్య ఉందంటే.. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనానికి కారణమైన సంచలన నాయకుడు కేసీఆర్. అది మా నాయకుడు. ఒక దిక్కేమో సంచలన నాయకుడు.. ఇంకో దిక్కు సంచులు మోసే దరిద్రుడు రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం రూ. 50 లక్షలతో దొరికిన ఒక థర్డ్ క్లాస్ క్రిమినల్.. దొంగ, చిప్పకూడు తిన్న దరిద్రుడు. ఎవడు దిక్కులేక వాడిని ప్రెసిడెంట్ చేసుకుని, ఆ దిక్కుమాలిన పార్టీ మళ్లా ఓట్లు అడుగుతరటా.. మీదికెళ్లి తెలంగాణ రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతదని అంటున్నాడు. మూడు గంటల కాంగ్రెస్ కావాల్నా.. మూడు పంటల కేసీఆర్ కావాల్నా.. మతం మంటల బీజేపీ కావాల్నా.. ఏం కావాలో తేల్చుకోండి. హర్యానాలో మతం పేరిట దాడులు చేసుకుంటున్నారు. ఓట్ల కోసం చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ బానిసలైనా కాంగ్రెస్, బీజేపీ.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ ఈ రాబోయే ఎన్నిక. పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలు ఈ ఢిల్లీ గద్దలను తరిమికొట్టాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.