హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో తన పాత్ర ఉన్నదంటూ నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికీ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు.
సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనలు చేసే హకు వారికి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియన్ పీనల్‌కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం కేటీఆర్ ఈ పరువునష్టం దావా నోటీసులు పంపించారు.
ఉన్నత విద్యావంతుడిగా, ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చేలా బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాల్లేని, సత్యదూరమైన ఆరోపణలను మానుకోవాలని.. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదురోవాల్సి వస్తుందని బండి సంజయ్, రేవంత్‌లను నోటీసులో పేరొన్నారు. వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌లను, ఇతర ఆధారాలను సాక్ష్యాలుగా లీగల్ నోటీసుతోపాటు జతచేశారు.