KTR | వేములవాడ : నవంబర్ 30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతోందని, సెంచరీ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మన తెలంగాణ స్టోరీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది బ్లాక్ బస్టర్. అవతల కాంగ్రెస్ సినిమాకు.. కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, గుజరాత్ యాక్టర్. సినిమా అట్టర్ ప్లాప్ డిజాస్టర్. ఇది బ్లాక్ బస్టర్, అది డిజాస్టర్. రేపు తెలంగాణను ఎవరూ నడపాలనేది మోదీ, రాహుల్ కాదు డిసైడ్ చేయాల్సింది.. తెలంగాణ గల్లీ డిసైడ్ చేయాలి. ఢిల్లీ కాదు. మళ్లా ఢిల్లీకి మన జుట్టు ఇస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి దిగుతడు. ఏదో మాట్లాడి ఆగం చేస్తరు. వేములవాడలో పోటీ చేస్తున్నది లక్ష్మీనరసింహారావు కాదు.. కేసీఆర్ అనుకోవాలి. మీరు అవతలి పార్టీకి ఓటేస్తే.. అది పోయేది ఢిల్లీకి, గుజరాత్‌కు.. ఆ తర్వాత అన్యాయం జరిగేది మనకు. వేములవాడకు ఇండస్ట్రీలు తేవాలి అన్నారు. మంచి మెజార్టీతో గెలిపించండి. మీ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను. మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకోని ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి. మెజార్టీ విషయంలో సిరిసిల్లతో పోటీ పడాలని కేటీఆర్ సూచించారు.
ఆ రోజు సిక్స్ పాయింట్ ఫార్మూలా తుంగలో తొక్కిన ఇందిరాగాంధీ.. మనుమడు రాహుల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి సిక్స్ గ్యారెంటీలు అంటుండు.. సిక్స్ గ్యారెంటీ కాదు రాహుల్ గాంధీ. నవంబర్ 30న నిన్ను తెలంగాణ సిక్స్ కొట్టుడు ఖాయం. విరాట్ కోహ్లీ సెంచరి కొట్టినట్టు కేసీఆర్ సెంచరీ కొట్టి వంద సీట్లతో తప్పకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసుడు కూడా ఖాయం. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా. సెంటిమెంట్లకు, ఆయిట్మెంట్లకు పడిపోకండి. మూడుసార్లు ఓడిపోయాను దండం పెడుతా అంటే పడిపోకండి. కులం కూడు పెట్టదు. సెంటిమెంట్‌తో ఏమీ కాదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.