KTR | గుంపుమేస్త్రి దావస్లో అన్నీ అబద్ధాలు చెప్పాడని కేటీఆర్ విమర్శించారు. ఇదేం గుంపుమేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నారన్నారు. కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొన్న కాంగ్రెస్‌కు ఓటువేసిన వారు పశ్చత్తాపపడుతున్నరు. ఊళ్లలో రైతులు బాధపడుతున్నరు. ఇదేంరా నాయన.. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు వస్తుండే.. ఇదేం గుంపు మేస్త్రిపాలన రా నాయన ఇప్పటి వరకు రైతుబంధు దిక్కులేదు అని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా? అంటే రేవంత్‌రెడ్డి ఏమన్నడు.. గదేం పదవి గుంపు మేస్త్రిలెక్క.. ఒకడు సున్నం కొడుతడు. ఒకడు సిమెంట్ వేస్తడు. నేనే గిట్లగిట్ల అంటే అయిపోతది అన్నడు. తూట్‌పాలిష్ ఏం ఉన్నది అన్నడు’ అంటూ కేటీఆర్ సైటర్లు వేశారు.
‘గుంపు మేస్త్రికి అనుభవం లేదు. అనుభవం ఉన్న కేసీఆర్ పైస పైస కూడబెట్టి 7500కోట్లు జమ చేసి 70లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రైతుబంధు వేశారు. గుంపు మేస్త్రి డిసెంబర్ 3న సీఎం అయ్యారు. అయ్యాక ఈ రోజు వరకు రైతుబంధు వేయాలా.. వద్దా? అని తెలుస్తలేదు. కానీ, విదేశాల్లోకి పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెబుతున్నడు. భరోసా వేస్తున్నామని దావోస్‌లో చెప్పిండు. రైతు భరోసా మొదలైందా? రైతు భరోసా అంటే రూ.15వేలు అకౌంట్లలో వేయాలి కదా? రైతుబంధును రైతు భరోసా అని పేరు మార్చి.. డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నడు గుంపుమేస్త్రి. ఇలా ఒక్కసారి కాదు. మీరు సోషల్ మీడియాలో గట్టిగా ఉంటే.. రోజుకు పదిసార్లు వాళ్లు దొరుకుతరు’ అంటూ సోషల్ మీడియా వారియర్లకు సూచించారు.
‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిన్న ఏం మాట మాట్లాండిడు. రైతుబంధుపడలేదు అని ఎవడన్న అంటే.. చెప్పుదీసి కొడుతా అంటున్నడు. ఇది మన గౌరవ మంత్రి కోమట్రెడ్డి మాట. కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరూ ఏమంటున్నరు.. రైతుబంధు పడలేంటే చెప్పు దీసి కొడుతం అంటున్నరు. రాష్ట్రంలో ఉన్న 70లక్షల మంది రైతులను అడుగుతున్నా. ఎవరికైతే పడలేదో వారిని ఆలోచించమని ఆడుగుతున్నా. వీళ్లను ఏ చెప్పుతో కొట్టాలి రైతుబంధు వేయనోళ్లను ఆలోచించమని అడుగుతున్న. చెప్పుతో కొడుతరా? ఓటుతో కొడుతరా? మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారంలో ఏసిండు ఎట్ల.. రెండుమూడు నెలలైనా ఎందుకు వేయస్తలేదు ఆలోచించమని కోరుతున్నా’నన్నారు.
‘రైతులు ఆల్రెడి మంట మీదున్నరు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చిండా? ఏప్రిల్‌లో ఇస్తడా? ఇవ్వకపోతే రైతులు ఊరుకుంటరా..? చీరి చింతకు కట్టరు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ మరిచిపోవద్దు. ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ల తరఫున మనమే గర్జించాలి. రూ.2లక్షల రుణమాఫీ అన్నడు. సోనియమ్మ జన్మదినం రూ.2లక్షల రుణమాఫీ అన్నడు. పోయి రుణం తెచ్చుకొండి నేను సంతకం పెడుతా అన్నడు. డిసెంబర్ 9 పోయింది. జనవరి 9 పోయింది. ఫిబ్రవరి 9 వస్తుంది. మరి చేస్తడా? చేయ చేతకాదు. ఎందుకంటే గుంపుమేస్త్రికి పని చేసిన తెలివి లేదు. ఎదో ప్రతిపక్షం డైలాగులు కొట్టుకుంటూ అవతలపడ్డడు. కేసీఆర్‌పై బూతుపురాణం ప్రయోగించుకుంటూ తిరుగాడు వదరుబోతోడు. ఆయనకు ఏం తెల్వది. తెల్వక ఏదో మాట్లాండిండు. ఫసాయించిండు. ఇవాళ కిందమీద పడుతున్నడు. రూ.2లక్షల రుణమాఫీ చేయనందుకు, రైతుబంధు భరోసా చాల్ చేయనందుకు.. రైతుబంధు వేయనందుకు తెలంగాణ రైతన్నలు.. రైతుబంధు వేయమంటే చెప్పుతోటి కొట్టమన్నందుకు రేపు కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ను ఓటుతో కొడుతరు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.