హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఆత్మ నిర్భర్ భారత్ నినాదం అదానీ నిర్భర్ భారత్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దేశంలో అదానీ గ్రూపునకు 200కు పైగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ స్టేషన్లు, సిమెంట్ ప్లాంట్లు, గనులు, రక్షణ రంగ పరిశ్రమలు, గ్యాస్ పంపిణీ నెట్వర్క్, ఎలక్ట్రికల్ కంపెనీలు ఉన్నాయని ఒక నివేదిక తెలిపింది. దేశంలోని 23 రాష్ట్రాల పరిధిలో 87 శాతం భూభాగంలో ఈ కంపెనీలు విస్తారించాయని పేర్కొన్నారు.
ఈ శతాబ్దపు జోక్…
అవినీతిపరులను ఎవ్వరినీ వదలొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును ఈ శతాబ్దపు జోక్‌గా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఇటీవల సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అవినీతిపరులను ఎవ్వరినీ వదలొద్దని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఈ వ్యాఖలు కొందరికి మినహాయింపు’ అంటూ ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహరంలో సీబీఐ సహా కేంద్ర నిఘా సంస్థలు ఏ మాత్రం స్పందించడంలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ‘కొందరికి మినహాయింపు’ అంటూ వ్యాఖ్యానించారు.
జై భీమ్, జై తెలంగాణ, జై భారత్ ..
జై భీమ్, జై తెలంగాణ, జై భారత్ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నెల 14న సచివాలయం సమీపంలో ఆవిష్కరించనున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఫుడ్ కాంక్లేవ్ -2023 నిర్వహించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో మంగళవారం ఫుడ్ కాంక్లేవ్ 2023 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కాంక్లేవ్‌లో 100 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కాంక్లేవ్ ద్వారా భారత్‌కు వ్యవసాయ, ఆహార రంగంలో ఉన్న అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.