మంచిర్యాల/పెద్దపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గోదావరిఖని/ ఫర్టిలైజర్ సిటీ: ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్‌కు పది చాన్స్‌లు ఇచ్చినా ప్రజల కోసం ఏమీ చేయలేదనీ, మోదీ తన దోస్త్ అదానీ కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పార్టీ పేరు మారింది కానీ డీఎన్ఏ మారలేదని స్పష్టంచేశారు. ఇది భారత రాష్ట్ర సమితి కాదు భారత రైతు సమితి అని చెప్పారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతోపాటు పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీసు కమిషనరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ విస్తరణ నాలుగో ప్లాంట్ పనులకు పునాది రాయి వేశారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయా సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల సంవత్సరంలో మనందరి లక్ష్యం ఒక్కటే ఉండాలె.. కేసీఆర్ తిరిగి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలె. నిర్మాణం మాత్రమే తెలిసిన మనకు.. విధ్వంసం తెలిసిన కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గులకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఎక్కడికక్కడ వాళ్ల కుట్రలను తిప్పికొట్టాలె’ అని పిలుపునిచ్చారు. బీజేపీ నుంచి రాష్ట్రంలో నలుగురు ఎంపీలను గెలిపిస్తే సింగరేణి నాలుగు గనులను వేలానికి పెట్టారని మండిపడ్డారు.

Ktr1
కాంగ్రెస్ పాలనలో.. రైతుల అరిగోస నిజం కాదా?
ఎన్నికలు రాగానే సంకాంత్రికి గంగిరెద్దురోళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వండంటూ అడుగుతున్నారని, ఒకటి కాదు పది చాన్స్‌లు ఇచ్చినా 55 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ఏమి చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరెంటు, ఎరువులు, విత్తనాలకు అరిగోస తప్పలేదని గుర్తుచేశారు. ఆనాడు కరెంట్ ఉంటే వార్త, ఈనాడు కరెంట్ పోతే వార్త అనేది వాస్తవమా? కాదా? తెలంగాణ వచ్చినంక పరిస్థితి మారలేదా? ప్రతి ఒక్కరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కనీసం మంచినీళ్లు, సాగునీరు, కరెంట్ ఇయ్యలేని సన్నాసులను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలించే ఛత్తీస్‌గఢ్‌కు పోయి అక్కడి రైతుల దుస్థితిని చూసిరావాలని, అవసరమైతే తానే బస్సులు పెట్టి రైతులను పంపిస్తానని చెప్పారు. 55 ఏండ్లు దగా చేసిన కాంగ్రెస్ ఇవాళ ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నదని ఎద్దేవా చేశారు.
నల్లధనం తెస్తా అని.. తెల్లముఖం వేసిన మోదీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నల్లధనం తెస్తానని, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోదీ ఇప్పుడు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ కాలేదని, ఆయన దోస్త్ అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకారని దుయ్యబట్టారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200కు పెంచిన మోదీని తిట్టాలా? బండకేసి కొట్టాలా? ఆలోచించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు మంచి పనులు చేద్దామన్న సోయి లేదని విమర్శించారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగానే కేంద్రం కూడా ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని, అందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేయాలని హితవు చెప్పారు.

Ktr2
పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నామని, వాటి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో రూ.2 వేల కోట్లతో నాలుగో ప్లాంట్ పనులను విస్తరిస్తున్నామని, 4 వేల మందికి ఉపాధి దొరుకుతుందని భరోసా ఇచ్చారు. దేవాపూర్‌ను సీఎస్ఆర్ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రామగుండానికి ఇండస్ట్రియల్, ఐటీ పారులను తీసుకొస్తామని, జూలై, ఆగస్టు నెలల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
మండుటెండల్లో గోదావరిలో సజీవ జలదృశ్యం
ఒకప్పుడు వర్షాకాలంలోనూ ఎడారిలా కనిపించిన గోదావరి నది నేడు మండుటెండల్లోనూ సజీవ జలదృశ్యంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయని, ఇది కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి, వాక్శుద్ధి, లక్ష్యశుద్ధి కారణంగానే తెలంగాణ సస్యశ్యామలం అయిందని వివరించారు. రెండుసార్లు ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్ అనే గౌరవం కూడా లేకుండా పొలిటికల్ టూరిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇప్పుడిప్పుడే తెలంగాణకు బంగారు బాటలు పడుతున్నయ్.. గట్టి పునాది పడుతున్నది. సాధించుకున్న తెలంగాణ గట్టిపడుతున్నది. నెర్రెలు వారిన.. నెత్తురు పారిన నేలపై సీఎం కేసీఆర్ జలాభిషేకం చేస్తున్నరు’ అని పేర్కొన్నారు.
సింగరేణిని అమ్మకానికి పెడితే అగ్నిగుండమే
రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నదని, అదే జరిగితే రామగుండంతోపాటు బొగ్గుగని మొత్తం అగ్నిగుండం అవుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సింగరేణి బొగ్గు గనులను కాపాడుకోవాలంటే ఒక్క బీజేపీ అభ్యర్థికి కూడా ఓటు వేయొద్దని, డిపాజిట్లు గల్లంతు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఆయా కార్యక్రమాల్లో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మండలి చీఫ్ విప్ టీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, రేఖానాయక్, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావ్, దివాకర్‌రావు, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, నడిపెల్లి దివాకర్‌రావు, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దండె విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Ktr3
ప్రియాంకగాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రియాంకగాంధీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటూ విమర్శించడం హాస్యాస్పదమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏటూజడ్ అంతా అవినీతేనని దుయ్యబట్టారు. ‘ఆకాశంలో స్పెక్ట్రమ్‌ను విడిచిపెట్ట లేదు. పాతాళంలో బొగ్గును విడిచిపెట్ట లేదు. అలాంటి వారొచ్చి ఇవాళ మనకు అవినీతి గురించి లెక్చర్లు చెప్తున్నారు. ఇక మనం సిగ్గుపడాలి’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలనలోని ఛత్తీస్‌గఢ్‌లో, బీజేపీ పాలిస్తున్న మహారాష్ట్రలో ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ఉపాధి కల్పనలో తెలంగాణ టాప్ : మంత్రి కొప్పుల
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఉపాధి కల్పనలో అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు ఏర్పాటై లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ భారీ లాభాలను ఆర్జిస్తున్నదని చెప్పారు.
శాంతిభద్రతకు పెద్దపీట: మహమూద్ అలీ
తెలంగాణ ఏర్పాటైన తర్వాత శాంతిభద్రతల నిర్వహణకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. గతంలో కేవలం రెండు కమిషనరేట్లు ఉండగా, ప్రస్తుతం అదనంగా ఏడు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సకల వసతులతో పోలీసు భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ పోలీసింగ్ దేశానికే రోల్‌మాడల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎక్కడ శాంతిభధ్రతలు బాగుంటాయో అక్కడికి పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికి రోల్‌మాడల్.
– రామగుండంలో పోలీసు కమిషనరేట్ ప్రారంభోత్సవంలో డీజీపీ అంజనీకుమార్
అన్ని రంగాల్లో ముందుకు: కోలేటి దామోదర్
తెలంగాణలో మాదిరిగా ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద పోలీసు భవనాల నిర్మాణం చేపట్టలేదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నదని చెప్పారు.

Ktr4