హైదరాబాద్ : ఎన్పీఏ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు కొత్తగా టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని అప్డేట్ చేస్తున్నామని, ౩౩ జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. కర్నాటకలో సీఎం పదవి అమ్మకం వార్తలు బీజేపీ నిజస్వరూపమని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించకపోవడంపై కేటీఆర్‌కు నెటిజన్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేటీఆర్ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించట్లేదో గంగూలీ, జై షాను అడగాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదంతో ప్రగతిని కొనసాగిస్తామని, వచ్చే ఎన్నికల్లో కాంగెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీలు మాకు పోటీనేనన్నారు. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోందని, హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందన్న నెటిజన్.. ఎన్పీఏ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రంపై రాష్ట్రాలు కలిసికట్టుగా ప్రజస్వామ్యయుతంగా పోరాడాలన్నారు.
టీఆర్ఎస్ తెలంగాణ వెలుపలకు కూడా విస్తరించాలని ఓ నెజిటన్ పేర్కొనగా.. భవిష్యత్‌లో ఏం జరగాల్సి ఉందో ఎవరికి తెలుసునని కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్‌లో బీడీఎన్టీ ల్యాబ్‌ను జూలైలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి యువత వచ్చి పట్టుదలగా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. 244 జీవోకు అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం ఇవ్వాలని నెజిటన్ కోరగా.. ప్రభుత్వ కార్యకలాపాల్లో చాలా రోజులుగా బ్లాక్‌చెయిన్ వినియోగంలో ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం ఏ ఒక్క ప్రముఖ విద్యాసంస్థను ఇవ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఐఐఎం, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ సంస్థల్లో ఒక్కటీ ఇవ్వలేదని, ఎనిమిదేళ్లుగా అడుగుతున్నామని, ఇక కేంద్రం ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. జీఆర్ఎస్ అంశం హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని, బీఆర్ఎస్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైతు అనుకూల విధానాలతో ఏడేళ్లలో సాగు 120శాతం పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లపైనే హత్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఓ నెజిటన్ పేర్కొనగా.. నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే మాధ్యమాలపై చర్యలుంటాయన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపులో మోదీ ప్రపంచ రికార్డు సృష్టిస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.