నల్లగొండ, జూలై 14 : జూనోటిక్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక అధికారి డాక్టర్ జి.వి.రమేష్ అన్నారు. మంగళవారం జోనోటిక్ వ్యాధులపై నల్లగొండలోని ఎస్సీడీడీ గర్ట్స్ ఏబీసీడీ క్యాంపస్లో విద్యార్థినులకు జూనోటిక్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారన్నారు. ముఖ్యంగా రేబిస్ వ్యాధి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని కనీసం 15 నిమిషాల పాటు సబ్బు, స్వచ్ఛమైన నీటితో బాగా కడిగి, ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సూచన మేరకు యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవాలని తెలిపారు.
వర్షాకాలంలో కొన్ని కుక్కలు ఆవేశంగా ఉండే అవకాశం ఉన్నందున పిల్లలు కుక్కలపై రాళ్లు వేయడం, కొట్టడం, వాటి కళ్లల్లోకి నేరుగా చూడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. కుక్క ఎదురైనప్పుడు పరిగెత్తకుండా ప్రశాంతంగా నిలబడాలని, దురదృష్టవశాత్తు కుక్క కరిచినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేసి వైద్య చికిత్స పొందాలని సూచించారు.
అదేవిధంగా జపనీస్ ఎన్సెఫలైటిస్, క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్), బ్రుసెల్లోసిస్, బద్దె పురుగుల ద్వారా వచ్చే వ్యాధులు, బర్డ్ ఫ్లూ, లెప్టోస్పైరోసిస్ వంటి జూనోటిక్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ రావిరాల మల్లికార్జున్, హెచ్డబ్ల్యూఓఎస్ విజయలక్ష్మి, స్వప్న, దూసరి భారతమ్మ, వెంకట్, నర్సమ్మ పాల్గొన్నారు.