హైదరాబాద్ : కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. చేనేతపై జీఎస్టీని తగ్గించాలని మీ కేంద్ర మంత్రి దర్శన్ జర్దోష్, గుజరాత్ బీజేపీ ప్రెసిడెంట్ సీఆర్ పాటిల్ డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. చేనేతపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఆ ఇద్దరు నేతలు డిమాండ్ చేశారు. మమ్మల్ని పట్టించుకోకపోయినా.. కనీసం గుజరాత్‌ను అయినా పట్టించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ సూచించారు.
2022, జనవరి 1వ తేదీ నుంచి చేనేతపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చేనేతపై జీఎస్టీని తగ్గించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. చేనేతపై జీఎస్టీ తగ్గించేంత వరకూ పోరాటం చేస్తామని, జనవరి 5 నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం చైర్మన్ యర్రమాద వెంకన్న నిన్న ప్రకటించారు. జనవరి 5వ తేదీన తెలంగాణలో హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మార్చ్‌కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి, పాల్గొంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టం చేశారు.
Your own MoS Textiles @DarshanaJardosh Ji & Gujarat BJP president are demanding that GST be reduced to 5%
— KTR (@KTRTRS) December 30, 2021
Hamaari Nahin to Sahi, Gujarat Ki Awaz Tho Suniye Sri @PiyushGoyal Ji👇
Union minister, state BJP chief want GST on textile reduced | https://t.co/cYOiAZtPfk