హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేండ్ల (2014-23)లో రూ. 1,21 లక్షల కోట్లు ఖర్చుచేసిందని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-14తో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో 9 ఏండ్లలోనే దాదాపు ఐదు రెట్లు అధికంగా నిధులు వెచ్చించినట్టు వెల్లడించారు. మంత్రి కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని మెట్రోరైల్ భవన్లో పట్టణాభివృద్ధిశాఖ తొమ్మిదేండ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో వచ్చిన నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల వల్లనే పట్టణాల అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. రానున్న రోజుల్లో శామీర్‌పేట, మేడ్చల్ వైపు డబుల్ డెకర్ స్కైవేలు (రోడ్డు, మెట్రోరైలు మార్గాల కోసం) నిర్మించేందుకు, హైదరాబాద్‌లో నిరంతర నీటి సరఫరాకు కృషిచేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకే అహ్మదాబాద్ తరహాలో జీహెచ్ఎంసీలో మున్సిపల్ బాండ్ల రూపంలో కొన్ని నిధులు సేకరించామని వెల్లడించారు. ప్రజలు హైదరాబాదే కాకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో వచ్చిన మార్పును గమనించాలని సూచించారు.
భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా
పట్టణాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేశాం కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే రాజకీయంగా విబేధాలున్నా రాష్ర్టానికి కేంద్రం అనేక అవార్డులు, ప్రశంసలు ఇవ్వక తప్పలేదని పేర్కొన్నారు. అయితే, పట్టణాల పురోగతికి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రజారవాణాను మెరుగుపర్చడం, మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటిసరఫరా, నాలాల మరమ్మతు వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నదని వివరించారు.
రోడ్ల నిర్మాణం కోసం రక్షణశాఖకు చెందిన ఒకటిన్నర ఎకరాల భూమి అవసరం కాగా, అనేకసార్లు అడిగినా కేంద్రం స్పందించలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మెట్రోరైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున బోగీల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమేనని తెలిపారు.
111 జీవో రద్దు కోసం బీఆర్ఎస్సహా అన్ని పార్టీలు గతంలో హమీలు ఇచ్చాయని, తాము ఇచ్చిన హామీ ప్రకారం జీవోను రద్దు చేశామని చెప్పారు. కొండపోచమ్మసాగర్ నుంచి జంట జలాశయాలను నింపే ప్రణాళికలు ఉన్నాయని, భవిష్యత్తులో ఈ జలాశయాలు కలుషితం కాకుండా ముందుగా మురుగునీటి శుద్ధికోసం ప్లాంట్లను నిర్మిస్తున్నట్టు వివరించారు. నగరంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ఓఅర్అర్ రింగ్ మెయిన్ నిర్మిస్తున్నామని, ఇప్పటికే 40 కిలోమీటర్లకుపైగా పనులు పూర్తయ్యాయని చెప్పారు.
Ktr
వాస్తవ పెట్టుబడి రూ.1.34 లక్షల కోట్లు
విద్యుత్తు శాఖకు సంబంధించి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వృద్ధి, బస్తీ దవాఖానల (ఆరోగ్యశాఖ) ఏర్పాటు, రోడ్లు భవనాలు, విద్య, మాతాశిశు సంక్షేమం మొదలైన ఇతర శాఖల ద్వారా వచ్చిన పెట్టుబడిని కలుపుకొంటే పట్టణ ప్రాం తాల్లో 2014-23 మధ్యకాలంలో మరో రూ. 12,757 కోట్లు అదనంగా పెట్టుబడి పెట్టినట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో పట్టణాల అభివృద్ధికి మొత్తంగా పెట్టిన పెట్టుబడి సుమారు రూ. 1,34,051.28 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.
మిస్సింగ్ లింక్‌రోడ్ల నిర్మాణం
లింక్‌రోడ్ల అభివృద్ధి కోసం హెచ్ఆర్డీసీఎల్ పేరుతో మరో ముఖ్యమైన ఎస్పీవీని 2017లో ఏర్పాటుచేశారు. కనెక్టివిటీ/మొబిలిటీని మెరుగుపరచడం, ప్రయాణ దూరాలను తగ్గించడం, ట్రాఫిక్ కార్యకలాపాలు, రహదారి భద్రతను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధికి దోహద పడటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటివరకు, 27.2 కిలోమీటర్ల పొడవున 25 మిస్సింగ్ లింక్ రోడ్ ప్రాజెక్టులు రూ.323.67 కోట్లతో పూర్తిచేయగా, మరో రూ.191.25 కోట్లతో 18 కిలోమీటర్లమేర 12 పనులు పురోగతిలో ఉన్నాయి.
సీఆర్ఎంపీతో రోడ్లపై గుంతలు మాయం
సీఆర్ఎంపీ ద్వారా హైదరాబాద్‌లోని 930 కిలోమీటర్ల ప్రధాన రహదారులను (3 లేదా అంతకంటే ఎకువ లేన్లు) గుర్తించి ప్రైవేట్ ఇన్ఫ్రా ఏజెన్సీలకు 5 సంవత్సరాలపాటు నిర్వహణ నిమిత్తం ఓపెన్ బిడ్ ప్రక్రియ ద్వారా అప్పగించారు. ఇప్పటివరకు, రూ.1,125.67 కోట్ల వ్యయంతో మొత్తం 810 కిలోమీటర్ల మేర రీ కార్పెటింగ్ పనులు పూర్తయ్యాయి. 2022-23 సంవత్సరంలో 186.32 కిలోమీటర్ల పొడవున రోడ్ల రీ-కార్పెట్ పనులు పూర్తిచేశారు. ఈ పథకాన్ని ముంబై కూడా అనుసరిస్తున్నది.
ముంపు సమస్య నివారణ
హైదరాబాద్, దాని పరిసరాల్లో వరదలను నివారించడానికి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్ఎన్డీపీ) ప్రారంభించింది. అన్ని చెరువులకు స్లూయిస్‌లు, తూ ములను అమర్చుతున్నారు. జీహెచ్ఎంసీ, దాని పరిసర మున్సిపాలిటీల్లో ఫేజ్-1 కింద రూ. 985.45 కోట్లతో చేపట్టిన 35 పనుల్లో రూ. 747.45 కోట్లతో సుమారు 46 కిలోమీటర్ల పొడవున 24 పనులు పూర్తయ్యాయి. మరో ఐదు పనులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయి. ఆరు పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటివరకు 37 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఎస్ఎన్డీపీ కారణంగా మొత్తం 150 కంటే ఎకువ కాలనీలు ముంపు సమస్య నుంచి బయటపడ్డాయి. పరిసర మున్సిపాలిటీల్లో రూ. 238 కోట్లతో చేపట్టిన 19 పనుల్లో 7 పనులు పూర్తయ్యాయి. మిగిలిన 12 పనులు పురోగతిలో ఉన్నాయి.
వ్యర్థాలతో విద్యుత్తు
వేస్ట్ టు ఎనర్జీ (డబ్ల్యూటీఈ)లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే పీపీపీ విధానంలో జవహర్‌నగర్‌లో రిఫ్యూజ్డ్ డిరైవ్డ్ ఫ్యూయల్ (ఆర్డీఎఫ్) ఆధారంగా 20 మెగావాట్ల ప్లాంట్ కొనసాగుతున్నది. మరో నాలుగు కొత్త ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. జవహర్ నగర్లో అదనంగా రూ.261 కోట్లతో రెండు ఎంఎల్డీ సామర్థ్యం గల లీచెట్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. వ్యర్థాలతో ఏటా రూ.200 కో ట్ల విలువైన ఎరువులను తయారు చేస్తున్నారు.
35 ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం
స్ట్రాటజిక్ అర్బన్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) హైదరాబాద్‌లోని ప్రధాన రవాణా మార్గాల్లో సంఘర్షణ రహిత కారిడార్లను రూపొందించడానికి, సగటు వేగాన్ని గంటకు 15 నుంచి 35 కిలోమీటర్లకు పెంచడానికి ఉద్దేశించినది. ఇందులో భాగంగా మొత్తం (48) పనులను రూ.8,052.92 కోట్లతో చేపట్టారు. వీటిలో ఇప్పటివరకు రూ.3,629.93 కోట్లతో 35 పనులు (19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్ లు, 7 ఆర్వోబీలు/ఆర్‌యూబీలు, ఒక కేబుల్ వంతెన, 3 ఇతర పనులు) పూర్తయ్యాయి. మిగిలిన 13 పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పథకం రెండోదశలో రూ.4,422.99 కోట్లతో మరో 27 హై ఇంటెన్సిటీ ఇన్ఫ్రా వర్ల ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. ఈ పథకం మొత్తం వ్యయం సుమారు రూ.12,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 35 పనులు పూర్తిచేస్తే.. కేంద్రం చేపట్టిన ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైఓవర్ రెండు పనులు ఇంకా పూర్తికాకపోవడం గమనార్హం. ఈ పనులు తమకు అప్పగిస్తే ఇప్పటికే పూర్తిచేసేవాళ్లమని కేటీఆర్ అన్నారు.
మున్సిపాలిటీలకు అవార్డులు, రివార్డులు
టీయూఎఫ్ఐడీసీ నిధులతో పట్టణ ప్రగతి కింద కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు సహా అన్ని పట్టణాల్లో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల పనులు చేపట్టారు. దీంతో రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, తాగునీటి సౌకర్యాలు, పారులు తదితర ప్రజా సౌకర్యాలు మెరుగయ్యాయి. కేంద్రం రాష్ట్రంలోని 45 యూఎల్బీలను ఓడీఎఫ్++గా ప్రకటించగా, మరో 70 యూఎల్బీలను ఓడీఎఫ్ +గా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏటా స్వచ్ఛభారత్ మిషన్ అవార్డులను అన్ని రాష్ర్టాలకన్నా ఎక్కువగా గెలుచుకొంటున్నది. పీఎం స్వనిధి పథకం కింద దేశంలో మొదటి 10 ర్యాంకులను తెలంగాణ సాధించింది. రాష్ర్టానికి ప్రతిష్ఠాత్మక ఏఐపీహెచ్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు, గ్రీన్ యాపిల్ ఎన్విరాన్మెంట్ అవార్డులు కూడా వచ్చాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు
ఎంఏయూడీలోని ఇతర విభాగాల్లో అభివృద్ధి
హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో..
ఓఆర్ఆర్ నెట్వర్క్ ప్రాజెక్ట్
సుంకిశాల ఇంటేక్వెల్ను రూ.2,215 కోట్లతో చేపట్టగా, 60% పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రుతుపవనాల వరుస వైఫల్యాలు ఏర్పడినా హైదరాబాద్ నగరానికి సురక్షిత నీరు అంతరాయం లేకుండా అందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి దాదాపు 60 టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. రూ.3,866 కోట్లతో 1,259.5 ఎంఎల్డీ సామర్థ్యంగల 31 ఎస్టీపీల నిర్మాణంతో మురుగునీటి మాస్టర్ ప్లాన్ అమలును చేపట్టారు. ఇప్పటికే కోకాపేట, దుర్గంచెరువు ఎస్టీపీలను ప్రారంభించారు. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100% మురుగునీటి శుద్ధి జరుగుతుంది.
ఓఆర్ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా నెట్వర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలకు నీటి సరఫరాకు రూ. 1.200 కోట్లతో పైప్‌లైన్ నెట్వర్క్ నిర్మాణం చేపట్టగా, 75 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద 165 రిజర్వాయర్లు, 2,900 కిలోమీటర్ల పొడవు పైపులైన్లు వేస్తున్నారు. దాదాపు లక్ష కొత్త నీటి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్ నగరంలోని పౌరులందరికీ మంచినీరు సరఫరా అవుతుంది. 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా పథకం కింద వాటర్‌బోర్డు పరిధిలోని 11.5 లక్షల కుటుంబాలకు చెందిన 5.9 లక్షల గృహాలు లబ్ధి పొందుతున్నాయి.