హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులోనే న్యాయం దొరుకుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశమని, దాంతో తెలంగాణకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల రాజకీయాల్లో తెలంగాణ ఎలా జోక్యం చేసుకోదో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాగే జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. మంగళవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో.. ఆయన కోసం ధర్నాలు చేయాలనుకొంటే రాజమండ్రిలో, విజయవాడలో, అమరావతిలో చేసుకోవాలి కానీ హైదరాబాద్‌లో ర్యాలీలు తీసి, ఇక్కడ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తామంటే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. చంద్రబాబు కోసం ఒకరు, మరొకరి కోసం ఇంకొకరు ర్యాలీలు తీస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
వాళ్ల పంచాయితీకి హైదరాబాద్ వేదికా?
‘ఆంధ్రప్రదేశ్‌లో ఒకరిపై ఒకరు తలపడండి. మాకేం అభ్యంతరం లేదు. రాజమండ్రిలో, విజయవాడలో, కర్నూల్లో భూమి దద్దరిల్లిపోయే ర్యాలీలు తీయండి.. మాకేం బాధలేదు. వాళ్ల పంచాయితీని తెచ్చి హైదరాబాద్‌లో కొట్లాడతామంటే ఎలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వం కచ్చితంగా స్పందిస్తుందని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. ఉనికి లేదు. అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు? సున్నితమైన అం శాలను సున్నితంగానే చూడాలి. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయస్థానంలో ఉన్న అం శంపై ఎవరుపడితే వాళ్లు రోడ్డుమీదికి వచ్చి ధర్నాలు చేస్తామంటే ఎలా? లోకేశ్, జగన్, పవన్ కల్యాణ్ నాకు దోస్తులే. ఆంధ్రాతో మాకేమీ తగాదాల్లేవు. ఇప్పటికిప్పుడుపోయి ఆంధ్రాలో యద్ధం చేయాల్సిన అవసరం లేదు’ అని స్పష్టంచేశారు. ‘ఆంధ్రా వాళ్లయినా, రాయలసీమ వాళ్లయినా, కేరళ వాళ్లయినా, పంజాబ్ వాళ్లయినా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇక్కడ లేని పంచాయితీ ఎందుకు? తెలంగాణలో పదేండ్ల నుంచి ఆంధ్రా ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు? లోకేశ్ తన ఫ్రెండ్ ద్వారా ఫోన్‌చేసి ర్యాలీలు చేసుకోనివ్వటం లేదు ఎందుకు? అని అడిగారు. ఇవ్వాళ మీరు చేశారని, మీకు పోటీగా ఇంకొకరు చేస్తారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఏం కావాలి? అని అడిగిన’ అని కేటీఆర్ తెలిపారు.
ఐటీకి ఇబ్బంది రానివ్వం
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ కారిడార్‌లో ర్యాలీలు జరగలేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ‘ఐటీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకూడదు. ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలి అని మేం ప్రయత్నం చేస్తున్నాం. ఎంతోమంది ఆంధ్రావాళ్లు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. వారికి వస్తున్న రిటర్న్‌లు బాగుండాలంటే ప్రశాంతంగా ఉండాలి. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఆంధ్రా రాజకీయాల్లో తలదూర్చకూడదని నిర్ణయం తీసుకున్నాం. మా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతమే కానీ పార్టీ నిర్ణయం కాదు. దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలి’ అని మంత్రి కేటీఆర్ కోరారు. సమావేశంలో ఎంపీ వెంకటేశ్‌నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, గోపీనాథ్, పార్టీ సీనియర్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.