KTR | హైదరాబాద్ : శాసనసభలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్.. కవి అలిశెట్టి ప్రభాకర్ మాటలను గుర్తు చేశారు. ఓటు హక్కు విలువను అలిశెట్టి మాటల్లో కేటీఆర్ చెప్పారు.
సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కొన్ని రాబందులు మళ్లీ తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో మన కవి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఒక మాటను గుర్తు చేయాలనుకుంటున్నాను. ‘జాగ్రత్త.. ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద.. చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు.. మీ జీవితం కింద ఎర్త్..’ అని అలిశెట్టి చెప్పారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళం అయిపోతారని ఆయన చెప్పారు. అందుకే తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం. దాన్ని ఎవరూ మార్చలేరు. ఎవరూ తెంచలేరు. తుంచలేరు. జనం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. అనేక విజయాలు సాధిస్తున్నాం. ఉత్సాహంగా పరిపాలనలో కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు పోతున్నాం. ఛాయిస్ మీ ముందుంది. మేం చెప్పింది తప్పయితే, అవాస్తవాలు ఉంటే మమ్మల్ని శిక్షించండి.. ఓడించండి అభ్యంతరం లేదు. కాంగ్రెస్ ఐదు దశాబ్దాల పాలన కూడా గుర్తుకు తెచ్చుకోండి. కాంగ్రెస్ అంటేనే అంధకారం.. కాంగ్రెస్కు అధికారమిస్తే.. ప్రజలకు అంధకారమే. అది కూదా గుర్తు తెచ్చుకోవాలని ప్రజలను కోరుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.