హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నెత్తి నోరు బాదుకుంటున్నారు. అదే క్రమంలో సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఆ పరిస్థితి మనకు రావొద్దంటే మనం అప్రమత్తంగా ఉండాలి. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ గొంతు విప్పాలి. మమ్మల్ని ఇక్కడ తిట్టుడు కాదు.. అక్కడ మాట్లాడండి.. అక్కడ బీజేపీని నిలదీయండని కేటీఆర్ సూచించారు.
తమాషా ఏందంటే మొన్న బీజేపీ సభ్యులు పోడియంలోకి వస్తే మీరు(స్పీకర్ను ఉద్దేశించి) నిర్ణయం తీసుకొని వారిని సస్పెండ్ చేశారు. తెల్లారి చూస్తే బీజేపీ అధ్యక్షుడి కంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కువగా బాధపడుతున్నాడు. బీజేపీ సభ్యులను ఇక్కడ్నుంచి పంపించినందుకు బాగా బాధపడుతున్నాడు. అవిభక్త కవలల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా దారుణం. వీళ్ల ఒప్పందం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఒకరిని మించి మరొకరు బాధ పడుతున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేసినట్టు.. ఇప్పుడు కూడా బయట కలిసి పని చేస్తున్నట్లు చాలా చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. వీళ్ల ఒప్పందంపై బయటైతే చాలా పుకార్లు ఉన్నాయని వ్యంగాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కేటీఆర్ సెటైర్లు వేశారు.