KTR | పెద్దపల్లి : దేశ సరిహద్దుల్లో ఆర్మీ నిరంతరం నిఘా ఉంచడం వల్లే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం.. దేశంలో అంతర్గత శాంతిభద్రతలు కాపాడే పోలీసులు ఎంత సేవ చేసినా.. శభాష్ అనే వారు తక్కువ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒక చిన్న తప్పు చేస్తే మాత్రం చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తారు. ఇది థ్యాంక్‌లెస్ జాబ్ అయినప్పటికీ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలిపారు. రామగుండంలో నూతనంగా నిర్మించిన పోలీసు కమిషనరేట్‌ను రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ రాజ్యం అవుతుందని ఒకరు, మత ఘర్షణలు చెలరేగుతాయని కొందరు, తెలంగాణ వారికి పరిపాలించే సత్తా ఉందా..? అని మరొకరు, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా..? అని కొందరు.. ఇలా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
కానీ ఇవాళ 9 ఏండ్ల తర్వాత.. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి చేరుకున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. సామర్థ్యంతో పాటు స్థిరత్వం కూడా ఉండాలి. రాజకీయ నాయకత్వానికి ఇవన్నీ ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. పోలీసు సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం పొల్యూషన్ అలవెన్స్ ఇస్తున్నాం. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అదికారం ఉన్నా లేకున్నా.. మంచి వ్యవస్థలు ఏర్పాటు జరిగినప్పుడు అవి ఎవరూ మార్చరు. తప్పకుండా కొనసాగిస్తారు. పోలీసింగ్‌లో చాలా మంచి మార్పులు వచ్చాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య ప్రాణాలు ఆర్పించాడని కేటీఆర్ గుర్తు చేశారు. కిష్టయ్య కుటుంబంలో వారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాం. కిష్టయ్య కుమార్తె ఇవాళ డాక్టర్ అయి.. కరీంనగర్‌లోని ఓ బస్తీ దవాఖానాలో పని చేస్తుంది. కిష్టయ్య త్యాగాన్ని మరిచిపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని కాపాడుకున్నదని కేటీఆర్ గుర్తు చేశారు.