హైదరాబాద్ : తెలంగాణలోని దాదాపు గ్రామాలన్నీ బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ విభాగంలో చేరడం పట్ల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో ఓడీఎఫ్ గ్రామాలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 96.74 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌గా మారడం సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు. 35.59 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో పల్లె ప్రగతి కార్యక్రమం కొత్త శకానికి నాంది పలికిందన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలను (96.74 శాతం) ఓడీఎఫ్ ప్లస్‌గా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వసతులు, మౌలిక సదుపాయాలతో తెలంగాణ పల్లెలు దేశంలో ముందువరుసలో నిలిచాయి. ఇటీవల ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేయడానికి కేంద్రం అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను అప్లోడ్ చేశారు. ఆ వివరాల ప్రకారం రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌గా నిలిచాయి. దేశంలో మొత్తం 5,82,903 గ్రామాలు ఉంటే 26,138 గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ ప్లస్ పరిధిలోకి వచ్చాయి. వాటిలో తెలంగాణకు సంబంధించినవే 13,737 (52శాతం) గ్రామాలు ఉన్నాయి.
ఓడీఎఫ్ ప్లస్ అంటే… కేవలం మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. ఆ తరువాతి దశ అయిన ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లో తడి పొడి చెత్తగా వేరు చేయడం, ప్రతి గ్రామానికి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్ సమకూర్చడం, శ్మశాన వాటికను నిర్మించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి.
Which state has the highest number of ODF villages in India?#Telangana at 96.74% under the able leadership of CM #KCR Garu is miles ahead of TN who is ranked second at 35.59%#PallePragathi has heralded a new era in Rural Development 👍
— KTR (@KTRTRS) January 3, 2022
My compliments to PR&RD Minister & team pic.twitter.com/aPq0x1eRDT