హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించిన ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్‌లా కేసీఆర్ సినిమా స్టార్ కాకపోయినప్పటికీ.. గుండె నిండా ఆత్మవిశ్వాసంతో ఒకే ఒక్కడు బయల్దేరి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. హనుమకొండలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సరిగ్గా వారం రోజులకు ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ 21వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ అనే ఒక నాయకుడు సాహసం చేసి.. 2001లో సమాజంలో ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. బాబును మించిన నాయకుడు లేడని పేపర్లలో నాడు రాతలు రాశారు. అటల్ బీహారి వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్‌లా సినిమా స్టార్ కాదు.. మీడియా పవర్ లేదు, మనీ పవర్, మజిల్ పవర్, కుల బలం లేదు. ఉన్నదంతా ఒక్కటే గుండె బలం. గుండె నిండా ఆత్మవిశ్వాసంతో ఒకే ఒక్కడు బయల్దేరి గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అప్పుడు కేసీఆర్ వయసు కేవలం 47 ఏండ్లు.
చంద్రబాబు ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా.. తెలంగాణ కోసం బయటకు వచ్చిండు. నేను ఎత్తిన ఈ గులాబీ జెండాను దించను. తెలంగాణ వచ్చే దాకా పోరాడుతా. ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టండి అని తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అలాంటి నాయకుడి మీద ఇవాళ కొంతమంది నాయకులు కుక్కల్లా మొరుగుతున్నారు. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులు నాడు లేరు. అలాంటి చిల్లర నాయకులు ఇవాళ బూతులు మాట్లాడటం దారుణం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎత్తిన జెండా దించకుండా 14 ఏండ్లు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ కోసం నిందలను, అవమానాలను భరించాడు. 2009లో తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అలా కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ఈ ప్రాంత ప్రజలకు అంకితమిచ్చాడని కేటీఆర్ పేర్కొన్నారు.