హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : దేశం పతనం దిశగా పరుగులుతీస్తుంటే, ప్రశ్నించాల్సిన పాత్రికేయం మౌనంగా ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మీడియా మోదీయాగా మారిందన్న ఆయన.. వార్తను వార్తలా చూపే పాత్రికేయం దేశానికి తక్షణ అవసరమని చెప్పారు. శనివారం ‘మీడియా ఇన్ తెలంగాణ.. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్’ అంశంపై తెలంగాణ మీడియా అకాడమీ -బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సెమినార్‌కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మీడియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రసంగించారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కే సీతారామారావు, వర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, డీన్ వడ్డానం శ్రీనివాస్, టీశాట్ సీఈవో శైలేష్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన ధీరోదాత్తమైన పాత్రను మరలా జర్నలిస్టులు పోషించాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తదనంతరం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రూపొందించిన న్యూస్లెటర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కేటీఆర్ ప్రసంగం సాగిందిలా..
వీటిపై ఒక్కనాడైనా అడిగిండ్రా..?
‘40 ఏండ్లల్లో ఎన్నడులేనంతంగా ద్రవ్యోల్బణం పెరిగింది. రూపాయి పాతాళానికి పడిపోయింది. పేదరికంలో నైజీరియాను తోసిరాజని మన దేశం పరుగులుపెడుతున్నది. అయినా ‘హలాల్.. హిజాబ్’ వంటి ప్యూడల్ భావాలను రెచ్చగొడుతున్నారు. విద్వేషపు మూకలు.. విషయం లేక విషం కక్కుతున్నాయి. అయితే జుమ్లా.. లేదా హమ్లా.. అన్నట్లుగా ఉన్నది పరిస్థితి. వారికి ఇంతలా రెచ్చిపోయేంత ధైర్యం ఎవరిచ్చారు? ప్రశ్నించేవారు లేకనా? అడిగేవారు లేకనా?’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామని, రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అని, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, అమెరికావాళ్లనే తీసుకొచ్చి మన దేశం వీసాల కోసం క్యూలో నిలబెడుతానని.. 50 రోజుల్లో ఈ దేశాన్ని సరిచేయకపోతే తగులబెట్టండి అని అన్నాడో పెద్దాయన. ఏం జరిగింది? ఏం ఒరగబెట్టారు?. వీటిపై జర్నలిస్టులు ఎవరైనా అడిగారా? లేదు.!! ’ అని కేటీఆర్ అన్నారు. పాత్రికేయులను అనాలనో.. కాంట్రవర్సీల కోసమో తానిలా మాట్లాడటం లేదని, వార్తను వార్తగా చూపించే సత్తా నేడు ఎవరిలోనూ కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. వార్తలు రాసిన జర్నలిస్టులను చంపిన సంఘటనలున్నాయని, నిగ్గదీసి అడిగితే ఏమవుతుందోనన్న భయంలోనే అంతా జీవిస్తున్నామని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవి వార్తలు కావా?
మంచిచేస్తే మంచిని, చెడుచేస్తే చెడును మీ డియా చూపించాలని కేటీఆర్ కోరారు. ‘ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని కడితే ఒక్కరు చూపించరు. భారీ అనితర సాధ్యమైన ఇంజినీరింగ్ అద్భుతాన్ని మీడియా ఎందుకు హైలైట్ చేయదు. 9 బిలియన్ డోసుల కరోనా వ్యాకిన్లను హైదరాబాద్ ఉత్పత్తి చేసిం ది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రయాణించే హెలికాప్టర్ హైదరాబాద్‌లోనే తయారైంది. నేను దుగ్ధతోనే, అసూయతోనో ఇలా మాట్లాడటంలేదు. ఆవేదనతో చెబుతున్న. మిషన్ కాకతీయ వల్ల చెరువు కట్టలు బలంగా తయారయ్యాయి. ఒకప్పుడు చెరువు కట్టతెగితే వార్త. కానీ ఇప్పుడు నెర్రలుబారిన నేలల్లో భూగర్భజలాలు పెరిగితే ప్రచురణార్హం కాదా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ‘పాలు, మాంసం, చేపల ఉత్పతుల్లో రికార్డు సృష్టించాం. ఐదు రకాల విప్లవాలతో తెలంగాణ గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైంది. నేడు చెరువుల్లో ఒక్కొక్కటి 15-20 కిలోల చేపలు కూడా దొరుకుతున్నయి. ఏకకాలంలో బావులు, చెరువులు, కుంటలు బోర్లు ఉబికి వస్తే వార్తకాదా? ఒకప్పుడు ఫ్లోరైడ్‌కు కేరాఫ్ అయిన నల్లగొండ జిల్లా నేడు దేశంలోనే వరిధాన్యం పడించడంలో నంబర్‌వన్‌గా ఉంది. ఇన్‌ల్యాండ్ ఫిషరీస్, నూనెగింజల ఉత్పత్తిలో అద్భుత ప్రగతిని సాధించింది. ఇవి వార్తలు కావా? ప్రచురణార్హం కావా? ఎందుకు ఒక్క కేసీఆర్ మాత్రమే వీటిపై గొంతుచించుకోవాలి. పలె ్లప్రగతిలో బెస్ట్ 20 అవార్డులొస్తే.. 19 తెలంగాణకే వచ్చాయి. పట్టణప్రగతి హరితహారంతో 7.7 శాతం గ్రీన్‌కవర్ పెరిగింది. హైదరాబాద్‌కు మొన్ననే గ్రీన్‌సిటీ అవార్డు వచ్చింది. ఇవి పతాకశీర్షికల్లో ఉండవా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి మీడియా సంచనాల కోసం నెగెటివ్‌ను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నదని, సా మాజిక మాధ్యమాలు వచ్చాక సోషల్ మీడియానా, యాంటీ సోషల్మీడియానా? అనే సందేహం కలుగుతున్నదని వ్యాఖ్యానించారు.
త్వరలోనే కొత్త మీడియా భవనం ప్రారంభం
సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొత్త మీడియా భవన్‌ను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో కలంవీరుల పాత్ర గొప్పదని, తెలంగాణ వచ్చాక జర్నలిస్టులను సగౌరవంగా సత్కరించుకున్నామని చెప్పారు. మలిదశ ఉద్యమంలో యాజమాన్యాలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నా.. ఈ ప్రాంత జర్నలిస్టులు, కలంవీరులు, తెలంగాణ బిడ్డలు అండగా ఉన్నారని, స్ట్రింగర్ల నుంచి డెస్క్ సిబ్బంది వరకు అంతా సపోర్ట్‌గా నిలవడంతోనే తెలంగాణను సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చినంక వారిని సమున్నతంగా గౌరవించుకున్నం. జర్నలిస్టు అయిన సోలిపేట రామలింగారెడ్డిని, కాంత్రికిరణ్ను ఎమ్మెల్యేలుగా చేసుకు న్నం. ఆర్ సత్యనారాయణను ఎమ్మెల్సీ, ఘం టా చక్రపాణిని టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను చేసుకున్నం. అల్లం నారాయణను మీడియా అకాడమీ చైర్మన్‌గా కట్టా శేఖర్‌రెడ్డిలను సమాచారహక్కు చట్టం కమిషనర్‌గా గౌరవించుకున్నం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జర్నలిస్టులకు 19వేల అక్రెడిటేషన్లు ఇచ్చినం. జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లు కేటాయించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 500మంది జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నం’ అని కేటీఆర్ వివరించారు.
ప్రతిభ, సత్తాతోనే రాజకీయాల్లో రాణింపు
ప్రతిభ, సత్తాలేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోకపోతే ఏ వారసత్వాన్నీ ప్రజలు అంగీకరించరని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. వారసత్వం అనేది రాజకీయాల్లోకి ఎంట్రీకార్డు మాత్రమేనని, ఏదో ఒక్కసారి గెలిచేందుకు మాత్రమే అది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి మహానేతలనే ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ‘మొదటి ఎన్నికల్లో నేను సిరిసిల్లలో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు 171 ఓట్ల తేడాతో గెలిచా. తర్వాత పనితీరుతో ఆ మెజార్టీని 53 వేలకు.. ఆ తర్వాత 89 వేలకు పెంచుకోగలిగాను. నేను పనికిరాను అనుకుంటే ప్రజలు వరుసగా గెలిపించరు. మెజార్టీ పెంచరు. నన్నూ పక్కనపెట్టేవారు’ అని కేటీఆర్ తన స్వీయ అనుభవాన్ని వివరించారు.
మీడియానా.. మోదియానా..
ఒక రాజకీయ నాయకుడిగా ఇన్వెస్టిగేటివ్ వార్తల కోసం ప్రతిరోజూ పేపర్లను శోధించాల్సి వస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో జరిగిన బోఫోర్స్, ఇతర కుంభకోణాలెన్నో జర్నలిస్టుల శోధనతోనే వెలుగుచూశాయని గుర్తుచేశారు. అలాంటి పాత్రికేయ విలువలు నేడు ఎందుకు కొరవడ్డాయని ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ ఒత్తిడి వల్లే.. ఆదానీకి 6 వేల కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వాల్సి వచ్చిందని పొరుగున ఉన్న శ్రీలంక దేశపు ఎనర్జీ విభాగాధిపతి అభియోగం మోపితే.. చర్చచేసే ధైర్యం ఇక్కడి మీడియాకు లేదు. దేశంలో మీడియా చచ్చిపోయిందంటే అంగీకరించగలమా? దేశంలో మీడియా మోదియాగా మారిందంటే తప్పవుతుందా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని ప్రతి మీడియా సంస్థనూ తాను తప్పుబట్టడం లేదని, రాజకీయ విభేదాలున్నందునే తాను ఇలా మాట్లాడటం లేదని ఆయన స్పష్టంచేశారు. ‘మోదీ మన్‌కీ బాత్ మనం వినాలి. మీ బాత్ ఎన్నడన్న మోదీ విన్నడా? జన్‌కీ బాత్ విన్నడా? సంపాదకులతోనో, జర్నలిస్టుతోనే సంభాషణ పెట్టిండా?.. ఎన్నడూ పెట్టడు. అడిగారా ఎవరైనా? అలా అడగాలంటేనే చాలా మందికి భయం’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రోజూ 13 పేపర్లు చదువుతా..
ఇవ్వాళ్టి పత్రికల్లో వార్త ఏదో, వాస్తవమేదో తెలుసుకునేందుకు కిందామీదా పడాల్సి వస్తున్నదని కేటీఆర్ చురకలంటించారు. పేపర్ తెరిస్తే.. స్పోర్ట్స్, సినిమా, బిజినెస్ లీడర్స్, నేరాలు ఘోరాలు, రాజకీయనేతల వార్తలే కనిపిస్తున్నాయని, ఒకే సంఘటన ఒక్కో పత్రికలో ఒక్కోలా ఉంటున్నదని చెప్పారు. ‘మా నాన్నగారు నేర్పిన అలవాట్లలో రోజూ గంటన్నరసేపు పత్రికలు చదవడమనేది నా ముఖ్యమైన దినచర్య. నేను రోజుకు 13 పేపర్లు చదువుతా. కానీ ఇటీవలికాలంలో వార్త ఏదో, వాస్తవమేదో తెలుసుకునేందుకు తండ్లాడాల్సి వస్తున్నది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘స్పోర్ట్స్, బిజినెస్, సినిమా, క్రైమ్, పాలిటిక్స్.. ఈ ఐదు క్యాటగిరీల వార్తలనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యతనిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఐదింటిలో ఏ టాలెంటూ అక్కర్లేనిది రాజకీయాలు మాత్రమే. దీంతో రాజకీయాల్లోకి వచ్చేందుకు చాలామంది తహతహలాడుతున్నారు’ అని మంత్రి కేటీఆర్ ఉదహరించారు. రెండురోజులు హైదరాబాద్‌ను సాఫ్ చేయకపోతే అంతా విమర్శిస్తారని, కానీ 22వేల పారిశుద్ధ్య కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకున్నా ఒక్క ప్రశంస కూడా రాదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాలు పడి ఏదో రెండు కాలనీలు జలమయమైతే.. ‘మునిగిపోయిన హైదరాబాద్’ అంటూ భూతద్దంలో పెట్టి చూపించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.