Minister KTR | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మహిళల కోసం ఓ సమగ్ర మ్యానిఫెస్టోను రూపొందించి, వచ్చే ఐదేండ్లలో దానిని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఆదివారం ‘ఉమెన్ ఆస్క్ కేటీఆర్’ పేరుతో మహిళలతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యాక డిసెంబర్ 15 లోపు ఒక రోజు సమావేశమవుదామని, మహిళలే తమ ఎజెండాను రూపొందించుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మహిళల విద్య, వైద్యం, సంక్షేమం తదితర అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించడంతోపాటు వారితో వివిధ అంశాలపై ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల కోసం ప్రత్యేక ఎజెండాను అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళా యూనివర్సిటీని ఏర్పాటుచేసుకున్నామని, మెట్రో స్టేషన్ల నుంచి పరిసర ప్రాంతాలకు మహిళలను ఉచితంగా చేర్చే విధంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని, ఇది బాధాకరమని పేర్కొన్నారు.
నాపై అమ్మ ప్రభావమే ఎక్కువ
‘నాపై మా అమ్మ ప్రభావమే ఎక్కువ. అమ్మకి చిన్నతనంలోనే పళ్లైంది. మా నాన్నవాళ్లకు తొమ్మిదిమంది అక్కాచెళ్లెళ్లు. చాలా పెద్ద కుటుంబం. నాన్న రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ మా అమ్మ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మాకు ఏ లోటూ రాకుండా చూసుకుంది. అమ్మను చూసి చాలా నేర్చుకున్నా. నా భార్యకు ఓపిక ఎక్కువ, ధైర్యవంతురాలు. మా చెల్లి ఫైటర్, డైనమిక్. అందరికంటే ఎగ్రెసివ్. మా పాపకు 14 సంవత్సరాలే అయినా చాలా ఆలోచిస్తుంది. మంచి రైటర్, క్రియేటివ్. కూతురు పుట్టాకే నా జీవితం చాలా మారింది.
హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకార్లుల్లో ఎకువ మంది మహిళలే. కొవిడ్ సమయంలో సుచిత్ర ఎల్లా, మహిమా దాట్ల వంటివారు గొప్పగా నిలిచారు. మహిళలు మానసికంగా చాలా బలంగా వుంటారు. 2014 ఎన్నికల సందర్భంగా సిరిసిల్లలోని గజసింగవరం అనే గ్రామ ప్రజలు నన్ను ప్రచారానికి రానివ్వలేదు. నేను వెనక్కు వెళ్తుంటే అదే ఊరుకి చెందిన సంపూర్ణ అనే ఓ అమ్మాయి తనను బలవంతంగా వారి ఊళ్లోకి ప్రచారానికి తీసుకొని వెళ్లింది. ఇచా చెప్పుకుంటూపోతే చాలా మంది శక్తిమంతమైన మహిళలు ఉన్నారు’ అని కేటీఆర్ వివరించారు.
బాలికల విక్రయాలు, పాతబస్తీలో బాల్య వివాహాలు నిర్మూలించాం
2014కు ముందు దేవరకొండలో బాలికల విక్రయాలు, పాతబస్తీలో వృద్ధ అరబ్‌షేక్‌లతో వివాహాలు వంటి వార్తలు తరచూ వినిపించేవని, అలాగే, ఫ్లోరోసిస్‌కు సంబంధించిన సమస్యలు అధికంగా ఉండేవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తరువాత మహిళా రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటు, ఇంటింటికీ తాగునీటి సరఫరావల్ల ఇవి చాలావరకు తగ్గిపోయాయని అన్నారు. ఒక్కో విద్యార్థినిపై రూ.10 వేల వరకూ ఖర్చుచేస్తున్నామని, దీంతో అమ్మాయిలు చదువుల్లో రాణిస్తున్నారని చెప్పారు.
అమ్మఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 61% పెరిగాయని, శిశుమరణాలు తగ్గిపోయాయని చెప్పారు. స్త్రీనిధి పథకంతో వడ్డీలేని రుణా లు ఇస్తుండటంతో మహిళా సంఘాల సభ్యులు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఎదుగుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల కోసం ప్రత్యేక వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.
కోహెడ, నందిగాం, సుల్తాన్పూర్తోపాటు మరో ప్రాంతంలో మహిళల కోసం ప్రత్యేకంగా నాలుగు ఇండస్ట్రియల్ పార్క్‌లను నెలకొల్పామని తెలిపారు. జనరల్ ఇండస్ట్రియల్ పార్క్‌లలో కూడా 10 శాతం మహిళలకు కేటాయిస్తున్నామని చెప్పారు. మహిళలకోసం వీహబ్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా దవాఖానల తరహాలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్నామని, ప్రతి డివిజన్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
సైబర్ క్రైమ్‌లపై ప్రత్యేక చట్టం
మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని, వారికోసం భరోసా సెంటర్లు, షీటీమ్స్‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. తాము కూడా డీప్ ఫేక్ బాధితులమేనని, విపక్షాలు తమను ఇబ్బంది పెట్టేందుకు ఈ తరహా చర్యలకు దిగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లను దూషించడం, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ఎక్కువైపోయిందని చెప్పారు. ఇటువంటివాటికి చెక్ పెట్టేందుకు నల్సార్ యూనివర్సిటీ సహకారంతో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ చట్టం తేవాలని నిర్ణయించామని తెలిపారు. ఈ చట్టంతో భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే విమర్శలు వచ్చే అవకాశముందని, అయితే తాము ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదుదారు తమ పేరు, చిరునామా చెప్పకుండానే ఫిర్యాదు నమోదు చేసే విధంగా తగిన వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. మహిళలు ఎదుర్కొంటున్న ఎటువంటి ఇబ్బందినైనా ఈ టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదుచేయవచ్చని, ఫిర్యాదు ఏ శాఖకు సంబంధించినదైతే ఆ శాఖకు బదిలీచేసి పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.