Minister KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్తు, సాగు, తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. వచ్చే టర్మ్‌లో రెండు అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పక్కా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని, ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హౌజ్ ఫర్ ఆల్ లక్ష్యంగా గృహలక్ష్మి, డబుల్ బెడ్రూంతోపా టు హోమ్ లోన్‌తో ఇల్లు కొనుక్కునే వారి కోసం కొత్త స్కీం తీసుకొస్తామని, వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణను నిరక్షరాస్యత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. క్రెడాయ్ హైదరాబాద్, నరెడ్కో తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్ ఫోరం, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ అని.. ఇప్పుడు సరికొత్త నగరం ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నదన్నారు. వారసత్వంగా మనకు లభించిన హైదరాబాద్‌ను కాపాడుకొంటూనే, కొత్తగా వస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటూ భవిష్యత్తు తరాలకు మెరుగైన హైదరాబాద్‌ను ఇవ్వాలన్నది బీఆర్ఎస్ ఉద్దేశమని చెప్పారు. వచ్చే టర్మ్‌లో బృహత్ ప్రణాళికలను అమలు చేయబోతున్నట్టు తెలిపారు.
బెంగళూరు కంటే హైదరాబాద్ చాలా బెటర్
రియల్ బూం ఇలాగే ఉండాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలని కేటీఆర్ అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో గత రెండేండ్లలో బెంగళూరు కంటే హైదరాబాద్ ముందంజలో నిలిచిందని తెలిపారు. బెంగళూరులో అనరాక్ అనే కంపెనీ 28 శాతం రియల్ గ్రోత్ పడిపోయిందని రెం డు రోజుల క్రితం నివేదిక ఇచ్చిందని చెప్పా రు. కీచులాటలు లేకుండా, సీఎం పదవి కోసం కొట్లాడుకోకుండా, ఆరు నెలలకోసారి సీల్డ్ కవర్ సీఎం వచ్చి మన నెత్తిన కూర్చోకుండా సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులతో ఒక రోజు కూర్చొని చర్చించి, ఆదే రోజు ఆరు జీవోలు ఇచ్చారని, అదే ఢిల్లీ వాళ్లు చేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే సుస్థిర ప్రభుత్వం, బలమైన నాయకత్వం ఉండాలన్నారు.
తెలంగాణ కోసం చచ్చేంత మమకారం
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అంశాలే లేవని కేటీఆర్ అన్నారు. అందుకే ప్రజలకు సంబంధం లేని అంశాలను ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తమకు ఉన్నది అహంకారం కాదని, తెలంగాణ కోసం చచ్చేంత మమకారమని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. సోషల్ మీడియా హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పక్షానే ప్రజలు ఉన్నారని చెప్పారు.
తెలంగాణ మాడల్ అంటే?
సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య, అభివృద్ధి తెలంగాణ మాడల్ అని కేటీఆర్ వివరించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు మనకు ముగ్గురు సీఎంలు మాత్రమే గుర్తొస్తారని చెప్పారు. ‘ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ, ప్రో హైదరాబాద్ అనేవి చంద్రబాబు మాడల్. ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేవి రాజశేఖర్‌రెడ్డి విధానాలు. అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ మాడల్. ఇది అరుదైన సమతూకం. ప్రపంచంలోనే తెలంగాణ అంటే ప్రోగ్రెసివ్ స్టేట్. మన రియల్ ఎస్టేట్ గ్రోత్ కోసం ఒక్కరోజే పది జీవోలు తీసుకొచ్చాం. తెలంగాణలో నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ ప్రగతి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. 25 ఏండ్లలో ఐటీ ఎగుమతి రూ.57 వేల కోట్లు ఉండె. 2021-22, 2022-23 మధ్య ఒక్క సంవత్సరంలోనే రూ.57 వేల కోట్ల గ్రోత్ వచ్చింది. 2014లో రూ.57 వేల కోట్లు ఉంటే.. 2014 నుంచి 2023 వరకు రూ.2.41 లక్షల కోట్లకు చేరింది. వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌గా నిలిచాం. టీఎస్ ఐపాస్‌తో 27 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చాం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 7.7 శాతం గ్రీన్ కవర్ పెరిగింది. పల్లె, పట్టణాలు కేసీఆర్ పాలనలో గొప్ప వృద్ధి సాధించాయి. తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది.
415 కిలోమీటర్ల మెట్రో
హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని, ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్యూచర్ రెడీ హైదరాబాద్ పేరు తో వచ్చే ఐదు నుంచి పదేండ్లలో 13 కీలకాంశాలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి వందేండ్లు పూర్తవుతుందని, ఆలోగా భవిష్యత్ తరాలకు కొత్త హైదరాబాద్‌ను అందివ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పా రు. హైదరాబాద్‌లో నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను రాబోయే పదేండ్లల్లో మూడు దశల్లో 415 కిలోమీటర్లకు విస్తరిస్తామన్నారు. రాష్ట్రం నలుమూలకు గంట వ్యవధిలోనే చేరుకోవడం, విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గించేందుకు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడిచే స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తేవటం తమ లక్ష్యమని వివరించారు. ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రెం డు తెలుగు రాష్ర్టాలకు మేలు జరిగేలా దాదాపు 790 కిలోమీటర్ల మేర కారిడార్లను గుర్తించామని తెలిపారు. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్యలో 500 నుంచి 1000 ఎకరాల్లో శాటిలైట్ టౌన్షిప్ పాలసీ సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే స్థాయికి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు.
ధరణిలో సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీ
కొత్త విధానాలను ప్రవేశపెట్టే తొలి రోజుల్లో బాలరిష్టాలు తప్పవని, ధరణిలో చాలా వరకు సమస్యలను పరిష్కరించామని కేటీఆర్ తెలిపారు. ధరణి రాకతో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. భూ రికార్డుల ట్యాంపరింగ్‌కు ఎలాంటి అస్కారం లేకుండా చేశామని చెప్పారు. ధరణిలో కొన్ని చిన్నచిన్న చిక్కులున్నాయని, వాటి పరిష్కారానికి నిపుణుల కమిటీ నియమిస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిష్కరించామని చెప్పారు. త్వరలో 31 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద 36 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా..మిగిలిన పనులు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు.
జరిగిన మంచిని ఎన్నడూ మరిచిపోవద్దు
తెలంగాణ వచ్చిన తరువాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఎన్నో నూతన విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో హైదరాబాద్ గణనీయమైన వృద్దిని చూసింది. ఇతర ప్రాంతాల వారు సైతం జీవించడానికి అనుకూలంగా మారింది. భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ పాత్ర కీలకంగా మారింది. అక్టోబర్ 2023లో నగరంలో ఆస్తి రిజిస్ట్రేషన్ల సంఖ్య 25 శాతం పెరిగింది. గతంతో పోల్చితే ఇది 41 శాతం అదనం. బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్డర్లు సమస్యలను పరిష్కరించింది. జరిగిన మంచిని ఎన్నడూ మరిచిపోవద్దు.
– వీ రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు
రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో మరింత అభివృద్ధి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నది. మెరుగైన లింక్ రోడ్లు, ఎస్ఎస్డీపీ, ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల్లో భాగంగా అండర్ పాస్‌లు, ైప్లె ఓవర్లను నిర్మించింది. వీటి కారణంగా నగరంలో ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగింది. రోడ్లు, రవాణా వ్యవస్థ మంచిగ ఉంటే పెట్టుబడులు వచ్చి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రభుత్వం స్థిరంగా ఉండి చిత్తశుద్ధితో నూతన విధివిధానాలను అమలు చేయడంతోపాటు గ్రిడ్ విధానం, హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు వంటివి రియల్ ఎస్టేట్ అభివృద్ధి వైపు నడిచేందుకు దోహపడుతున్నాయి.
– సునీల్ చంద్రారెడ్డి, నారెడ్కో అధ్యక్షుడు
అభివృద్ధి చూసి ఓటేయండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. స్వరాష్ట్రంలో స్థిరమైన పాలన కొనసాగుతుండటంతో పెట్టుబడులు పెరిగి రియల్ ఎస్టేట్ అంతకంతకు వృద్ధి సాధిస్తున్నది. ఒక్క ఎల్బీనగర్ ప్రాంతంలోనే రూ.3,700 కోట్లతో అండర్‌పాస్, రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. 10 ఏండ్లుగా అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధితో సరికొత్త జీవోలను అమలు చేస్తు పెట్టుబడులను తీసుకువస్తుంది. ప్రజలు కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలి.
– నరసింహారావు, టీబీఎఫ్ ప్రధాన కార్యదర్శి
పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ
నగరంలో రియల్ ఎస్టేట్ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణను పరిశ్రమలకు అనుకూలంగా మలచడానికి ప్రభుత్వం టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ వంటి వాటిని ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశానికి అధిక జీఎస్టీని అందిస్తున్న ఘనత తెలంగాణదే. రీజనల్ రింగ్ రోడ్డు అమలుతో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుంది. ధరణితో అనేకమందికి మేలు జరుగుతున్నది.
– జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
వారసత్వంగా మనకు లభించిన హైదరాబాద్‌ను కాపాడుకొంటూనే, కొత్తగా వస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటూ భవిష్యత్తు తరాలకు మెరుగైన హైదరాబాద్‌ను ఇవ్వాలన్నది బీఆర్ఎస్ ఉద్దేశం. వచ్చే టర్మ్‌లో బృహత్ ప్రణాళికలను అమలు చేయబోతున్నాం. హౌజ్ ఫర్ ఆల్ లక్ష్యంగా గృహలక్ష్మి, డబుల్ బెడ్రూంతోపాటు హోమ్ లోన్‌తో ఇల్లు కొనుక్కునే వారి కోసం కొత్త స్కీం తీసుకొస్తాం.. వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుంది.
– మంత్రి కేటీఆర్