రాజన్న సిరిసిల్ల : కరెంట్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్(Congress) వాళ్లకు సిగ్గు, శరం, ఇజ్జత్ ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) ఆ పార్టీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాబాద్(Musthabad ) మండల కేంద్రంలో రోడ్ షో(Road show)లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఊర్లో ఎవరైనా చనిపోతే, స్నానం చేయాలి పదినిమిషాలు కరెంటు ఇవ్వమని బతిమిలాడే పరిస్థితి ఉండేదన్నారు.
తెలంగాణలో బీదాబిక్కి రైతులు ఉన్నారు. మూడు గంటలు కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నడు. రైతుబంధు వద్దు, పట్వారీ వ్యవస్థ కావాలని అంటున్నారు. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. 55 ఏండ్లు, 11 సార్లు అవకాశాలు ఇస్తే ఏం చేశారు. బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్లలో అభివృద్ధి జరగలేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈసారి గెలిస్తే కోడళ్ల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం ప్రవేశ పెడతామన్నారు. వచ్చే జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త కార్డులు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తామని హామీనిచ్చారు.
డిసెంబర్ తరువాత పెరిగిన సిలిండర్ ధర రూ.800 తగ్గించి, రూ.400 ఇస్తామన్నారు. అలాగే తెల్ల కార్డు దారులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లకు మెడికల్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేశాం. నియోజ కవర్గంలో ప్రతి గ్రామంలో బడిని బాగు చేయాలన్నది నా లక్ష్యం అని మంత్రి తెలిపారు. సిరిసిల్ల ప్రాంత ప్రజల 50 సంవత్సరాల కోరిక ఎగువ మానేరు నింపాం.
కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని నమ్మండి.. సోషల్ మీడియాలో పోస్ట్లు నమ్మకండి..అన్ని చూసి ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. 200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్లు నాలుగు వేలు ఇస్తామంటే ఎలా నమ్మాలి? అలిగినా గులిగినా మనోడి మీదనే, ఢిల్లీఓడి చేతిలో తెలంగాణను మళ్లీ బందీ చేయొద్దన్నారు.