హైదరాబాద్ : తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తైవాన్ పెట్టుబడులకు ఆది నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా తెలంగాణ – తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందన్నారు. తైవాన్ పెట్టుబడుల కోసం గతంలో ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తైవాన్ దేశానికి సంబంధించిన టీసీఏ (taiwan computer association) తో టెక్నాలజీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇండియన్ తైవాన్ స్టార్టప్ అలయన్స్‌ని ఏర్పాటు చేసుకున్న ఏకైక భారత సిటీగా హైదరాబాద్ ఉందని కేటీఆర్ అన్నారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తామని కేటీఆర్ అన్నారు. 2020వ సంవత్సరం నుంచి వ్యాపార వాణిజ్య పరిస్థితులకు కరోనా సంక్షోభం సవాళ్లను విసిరిందని, అయితే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని కేటీఆర్ క్లుప్తంగా వివరించారు. ఇప్పటికే రాష్ట్రం సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని, తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం పెరుగుతూ వస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణ ప్రతిసారి అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ వస్తుందన్నారు.
అయితే తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని, ఈ దిశగా తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం తైవాన్‌కి చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ మరియు దాని అనుబంధ రంగాల్లో తైవాన్ తో బలమైన భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కృషి చేద్దామని కేటీఆర్ కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా తెలంగాణ రాష్ట్ర పాలసీలు, రాష్ట్రం సాధిస్తున్న పురోగతి పైన ప్రశంసలు కురిపించారు. ఇన్వెస్ట్ ఇండియా తరఫున తెలంగాణతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ తమకు అత్యంత ప్రోత్సాహం ఇస్తుందని ఈ సందర్భంగా అన్నారు.
అనంతరం టైట్రా (Taiwan External Trade Development Council) చైర్మన్ జేమ్స్ ఎఫ్ హువంగ్ మాట్లాడుతూ.. తెలంగాణ తైవాన్ దేశానికి సహజ భాగస్వామి అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తాము అద్భుతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని, రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో ఈ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ దిశగా ఈ రోజు ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటు చేసిన సమావేశం ఉపయుక్తంగా ఉంటుందని ఆశించారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీ ఫైబర్ సీఈవో సుజయ్ కారంపూరి పాల్గొన్నారు.
IT & Industries Minister @KTRTRS virtually participated in the "Taiwan – Connect" Telangana State meeting hosted by @investindia. During the meeting, the Minister highlighted the investment opportunities for Taiwan based companies in Telangana. pic.twitter.com/MR4vhOQpZb
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 30, 2021