KTR | హైదరాబాద్ : తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, కేసీఆర్ సర్కార్లో అరుదైన సమతుల్యత కనబడుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు.. ఆర్థిక పరిస్థితి ఏందో అని కొన్ని వర్గాల్లో ఆందోళన ఉండేది. అపోహాలు, అనుమానాలు, ఉండేవి. నాటి పరిస్థితి, నేటి పరిస్థితి ఎలా ఉందో మీ అందరూ చూస్తున్నారు. హైదరాబాద్ మహానగరం ఎలా మారిందో మీ అందరికీ తెలుసు. కరెంట్, సాగు,తాగు నీటి పరిస్థితులును గుర్తు చేసుకోండి. ఈ మూడింటిని అధిగమించాం. వైద్యం, విద్యాసంస్థలు ఇలా చెబుతూ పోతే.. ప్రతి రంగంలో గణనీయమైన గుణాత్మకమైన మార్పు వచ్చింది. మన తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడ్డప్పుడు లక్షా 14 వేలు ఉండే. ఇప్పుడు 3 లక్షల 17 వేలకు చేరింది. మీకు పరిపాలన చేయడం వచ్చా..? అని వెక్కరించిన వారికి కంగు తినిపిస్తూ మన రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉంది. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రకటించిందని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్. పదాలు బాగున్నాయిని వాడటం లేదు. తెలంగాణలో జరుగుతున్న సమతుల్య మోడల్ ఎక్కడా లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది. ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఇమేజ్ ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఒక ఇమేజ్ కోసం తాపత్రయ పడ్డారు. ప్రో పూర్, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్ అన్నారు. కానీ ఇవాళ కేసీఆర్ సర్కార్లో అరుదైన సమతుల్యత కనబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు పండించే స్థాయికి ఎదిగాం. అన్నపూర్ణగా మారింది తెలంగాణ. 2014లో ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉండే. అక్కడి నుంచి 2 లక్షల 41 వేల కోట్లకు పెరిగింది. హైదరాబాద్, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరించాం. ఐటీ ఉద్యోగుల సంఖ్య తెలంగాణలో 10 లక్షలకు చేరుకుంది. ఒక వైపు వ్యవసాయం, మరో వైపు ఐటీని అభివృద్ధి చేశాం. పరిశ్రమలు పెరుగుతున్నాయి. పర్యావరణం పెరుగుతుంది. హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్ను పెంచాం. గ్రీన్ బడ్జెట్ పెట్టి, చట్టాలు చేసి చెట్లు కాపాడాలని ఆదేశించాం. ఉద్యోగాలు పోతాయని హెచ్చరించాం. భవిష్యత్ తరాల కోసం హరితాన్ని పెంచే ప్రయత్నం చేశాం. పర్యావరణహితంగా ఉండే పరిశ్రమలను ఎంకరేజ్ చేశాం. 24 వేల పరిశ్రమలు వచ్చాయి. లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఆ విధంగా రూరల్ డెలవప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం, ఐటీ, వెల్ఫేర్.. ఈ అరుదైన సమతుల్యత కనబడేది మన తెలంగాణలోనే మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు.