బీజేపీ నాయకులా.. దేశ యువతనా?
ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎవరికి వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. “అగ్నిపథ్ పథకంతో యువత డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లు, వాషర్మెన్లుగా ఉపాధి పొందొచ్చని ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి చెప్పారు. మరోవైపు అగ్నివీర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని బీజేపీ సీనియర్ ముఖ్య నాయకుడు ఒకరు అన్నారు. కానీ మోదీజీ మాత్రం అగ్నిపథ్ గురించి యువత సరిగ్గా అర్థం చేసుకోలేదని నిందిస్తున్నారు. ఇంతకీ అర్థం చేసుకోనిది ఎవరు? యువతనా లేక బీజేపీ నాయకులా?, అని అర్థం వచ్చేలా మంత్రి కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వార్తను మంత్రి ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన మోదీ- అదానీ అవినీతి బంధంపై శ్రీలంక చేస్తున్న ఆరోపణల నుంచి భారతదేశ దృష్టిని మరల్చడానికి ఒక ఉపాయం మాత్రమేనా? జస్ట్ ఆస్కింగ్’.. అంటూ మరో ట్వీట్ చేశారు.
పేద కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండ
మరో పేద కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన సంపత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇంటిపై నుంచి పడిపోవడంతో వెన్నెముక విరిగింది. మూడేండ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. తన వైద్యానికి, ఇద్దరు పిల్లలను చదివించడానికి ఆయన భార్య సరిత చిన్న చిన్న పనులు చేస్తున్నది. కానీ, వచ్చే డబ్బు సరిపోవడం లేదు. ‘ఆ ఇద్దరు పిల్లలను చూసి అయిన ఆ కుటుంబానికి సాయం చేయండి’ అన్నా అంటూ జయంత్‌గౌడ్ అనే నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. సాధ్యమైనంత త్వరగా సాయం చేయాలని తన ఆఫీస్‌ను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.