హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలో పురోగతి రైతుల ఆర్థిక ప్రగతికి కూడా బాటలు వేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఆదివారం చికాగో నగరంలోని చికాగో ఫుడ్స్టాప్ను సందర్శించారు. షాపులు, ఆహార పద్ధతులు, వాటి చరిత్ర, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన వంటి అంశాలను పరిశీలించారు.
అనంతరం వరల్డ్ బిజినెస్ చికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. ముఖ్యంగా చికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రొక్యుర్‌మెంట్ పద్ధతులపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చికాగో ఫుడ్‌స్టాప్ తరహా వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ ప్రాధాన్యం ఎంతో ఉన్నదని, ఇది ఆహార పరిశ్రమకు మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపైన ఆధారపడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల అభివృద్ధికి సైతం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణలో ఫుడ్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇలాంటి వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే రైతుల ఆర్థిక పురోగతి మరింత సాధ్యమవుతుందని తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 10 వేల ఎకరాలు
ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మాంసం ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, వంటనూనెల రంగంలో వస్తున్న ఐదు విప్లవాల గురించి వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగమైన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, భారీ ఎత్తున పెట్టుబడులు సమీకరిస్తున్నామని తెలిపారు. కోకాకోలా, పెప్సీకో, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం తెలంగాణలో పదివేల ఎకరాలకుపైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ విభాగం ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఓ9 సొల్యూషన్స్ ఆర్అండ్డీ కేంద్రం
అమెరికాకు చెందిన గ్లోబల్ సైప్లె చెయిన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓ9 హైదరాబాద్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నది. ఇక్కడినుంచే ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలు అందించే విధంగా హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా మలుచుకోవాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో ఆదివారం సమావేశమైన సందర్భంగా ఓ9 సహ వ్యవస్థాపకుడు, సీఈవో చక్రి గొట్టెముక్కల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది కార్యరూపం దాల్చిన వెంటనే రాష్ట్రంలో అత్యధిక వేతనాలతో కూడిన 1000 ఉద్యోగాలు రానున్నాయి. అంతేకాకుండా ఓ9 సొల్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయనున్నది. స్థానిక ఇంజినీర్లు గ్లోబల్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను సాధించే విధంగా ఇక్కడ శిక్షణనివ్వనున్నారు.