హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వాటర్ అండ్ శానిటేషన్ హైజీన్ (వాష్) ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే తొలి కస్టమర్‌గా ‘వాష్’ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.
నానక్‌రాంగూడలో రెండు రోజులపాటు జరిగిన ‘ఇంక్ వాష్ 3.0’ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారతదేశం గ్రామాల్లోనే ఉన్నదని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాట వాస్తమని, దేశంలోని 70% మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారని అన్నారు. దేశానికి, రాష్ట్రాలకు పట్టణాలే ఆర్థిక చోదకాలుగా ఉన్నాయని, తెలంగాణలో కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని మొత్తం జనాభాలో 46% మంది పట్టణాల్లోనే ఉంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 25% మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని, రాష్ట్ర జీఎస్డీపీలో మాత్రం హైదరాబాద్ వాటా 45-50% ఉన్నదని వెల్లడించారు.
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ప్రధానంగా ప్రపంచంలోని 70 నగరాల నుంచే ఆదాయం వస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల గతంలో తనకు తెలిపారని కేటీఆర్ చెప్పారు. మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పట్టణాలకు వలస వస్తున్నారని, దీంతో మున్ముందు పట్టణాల జనాభా ఇంకా పెరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం చివరి నాటికి హైదరాబాద్ నగరం నుంచి వచ్చే మురుగు నీటినంతటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. సమాజానికి అభివృద్ధి ఒక్కటే ముఖ్యంకాదని, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమవడంతో పర్యావరణ పరిస్థితులు కొంత మెరుగయ్యాయని చెప్పారు.
ఈసారి 3 రోజులు ఇంక్ వాష్
భారత్‌లో యువ జనాభా అధికంగా ఉన్నదని, 27 ఏండ్లలోపు వయసువారు 50% మంది, 35 సంవత్సరాల్లోపు వారు 65% మంది ఉన్నారని గుర్తుచేస్తూ.. మన దేశ ప్రధాన బలం ఇదేనన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధ జనాభా అధికంగా ఉండటంతో అక్కడ ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వచ్చే ఇంక్ వాష్ కార్యక్రమాన్ని 3 రోజులపాటు నిర్వహించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులను, వినూత్న ఆవిష్కరణలను ఆహ్వానించాలని నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్‌లోని 45 చెరువులను వివిధ సంస్థలు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాయని, మరో 15 చెరువులను జీహెచ్ఎంసీ, హెచ్ఏండీఏ సుందరీకరిస్తున్నాయని తెలిపారు.
ఇదే విధంగా దుర్గం చెరువును తీర్చిదిద్దామని చెప్పారు. అనంతరం వాష్ ఇన్నోవేషన్ హబ్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాష్ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య, ఆస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి, మాలినిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మైసూర్, కాన్పూర్, చండీగఢ్, పనాజీ మేయర్లతోపాటుగా తెలంగాణకు చెందిన మేయర్లు హాజరయ్యారు.
తెలంగాణకు డైకి యాక్సెస్ యూనిట్
దక్షిణ భారత్‌లో తమ కంపెనీ తొలిసారి తెలంగాణలో పెట్టుబడులను పెట్టనున్నట్టు డైకి యాక్సెస్ ప్రకటించింది. ఇప్పటికే గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో తమ యూనిట్లు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు నచ్చి ఇక్కడ తమ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కంపెనీ ప్రతినిధి కమల్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. గుజరాత్ కంటే ఇక్కడ మెరుగైన విధానాలు, సానుకూల పరిస్థితులు ఉంటాయని ఆ కంపెనీకి భరోసా ఇచ్చారు.