హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టి అంతా అభివృద్దిపైనే.. రాజకీయాలపై కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయమంతా అభివృద్ధికే కేటాయిస్తామని ఆయన తేల్చిచెప్పారు. గచ్చిబౌలిలో జడ్ఎఫ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతం అని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలకు అన్ని రకాల వాతావరణం ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. హిజాబ్, హలాల్, మతకల్లోలాలు ఇక్కడ లేవన్నారు. ప్రతిభ ఉన్న యువతకు ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం భారీ కంపెనీలనే కాకుండా చిన్న, మధ్యతరహా కంపెనీలను కూడా ఆకర్షిస్తుందన్నారు. ఆటోమొబైల్ రంగంలో బాశ్, హ్యుందాయ్ తదితర ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ మొబిలిటి వ్యాలీ(టీఎంవీ)లో భాగంగా జడ్ఎఫ్ను ఇక్కడికి ఆహ్వానించామన్నారు.
భారతదేశ రోడ్లకు అనుగుణంగా వాహనాలను రూపొందించాల్సి ఉంటుందని, అటానమస్ డ్రైవింగ్ విధానంలో ఇక్కడ ప్రత్యేక ప్రొగ్రామింగ్ను రాయాల్సి ఉంటుందని, ఇది ఒక సవాల్ అంటూ సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. మొబిలిటి, ఎమర్జింగ్ టెక్నాలజీలు రాబోయే కాలంలో ఉద్యోగాలు కల్పించడంలో, ఆర్థికంగా ఎదుగుదులలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జడ్ఎఫ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, ఇండియా రిజినల్ హెడ్ కేవీ సురేశ్, సీనియర్ ఉపాధ్యక్షుడు డ్రిక్ అడమ్జిక్, ఉపాధ్యక్షుడు కృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Minister @KTRTRS inaugurated the new ZF Tech Center in Hyderabad today. This fecility is the largest Software Hub for the ZF Group. With the expansion and the new fecility, ZF Tech Centre will create extensive job opportunities in Telangana State. pic.twitter.com/ATFMC0X60Z
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 1, 2022