హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని, గత రెండేండ్లలో దేశంలో వచ్చిన టెక్ ఉద్యోగాల్లో 44 శాతం హైదరాబాద్ నుంచే వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రతి ఇద్దరు టెకీల్లో ఒకరు తెలంగాణ నుంచే ఉన్నారని వెల్లడించారు. మైక్రోచిప్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ రిసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 9 ఏండ్లలో తెలంగాణ ఐటీ రంగంలో గణనీయ వృద్ధిరేటును నమోదు చేసిందని వివరించారు. ‘ఉద్యోగావకాశాలు 3 రెట్లు పెరిగితే, ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగాయి.
2014లో ఐటీ ఉద్యోగాలు 3,23,396 ఉంటే, 2023 నాటికి 9,05,715 ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఎగుమతులు 2014లో రూ.57,258 కోట్లు ఉంటే, 2023 నాటికి రూ.2,41,275 కోట్లుగా ఉన్నాయి. ఈ ఒక్క రంగమే కాదు లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, మెడికల్ డివైజెస్ రంగాల్లోనూ హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్నది’ అని వెల్లడించారు. దేశంలోని మొత్తం ఫార్మాసూటికల్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నదని, మూడో వంతు గ్లోబల్ వ్యాక్సిన్స్ ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి 50 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే తయారవుతాయని, అవి సుమారు 14 బిలియన్ డోసులుగా ఉంటాయని తెలిపారు.
దేశంలోనే అతి పెద్ద మెడికల్ డివైజెస్ పార్కు
దేశంలోనే అతి పెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఇక్కడే ఉన్నదని, ఇక్కడి కంపెనీలతో కలిసి పనిచేసేందుకు ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలకు మంచి అవకాశం ఉన్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆటోమొబైల్ రంగం అభివృద్ధి కోసం తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ‘దేశంలోనే తొలిసారిగా ఈ తరహా కేంద్రాన్ని రాష్ట్రంలో ప్రారంభించాం. ఇందులో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఈ జాబితాలో ఇంటెల్, బాష్, జెడ్ఎఫ్, క్వాల్కామ్, స్టెలాంటిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి నాలెడ్జ్ పార్ట్నర్గా మైక్రోచిప్ టెక్నాలజీస్ వ్యహరించాలి’ అని సూచించారు. ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థగా తెలంగాణ అకాడమీ అండ్ స్కిల్, నాలెడ్జ్ (టాస్క్) సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
25 ఏండ్లుగా దేశంలో మైక్రోచిప్ కార్యకలాపాలు
దేశంలో మైక్రోచిప్ కార్యకలాపాలు 25 ఏండ్లుగా విజయవంతంగా కొనసాగిస్తున్నామని, మరింతగా విస్తరించేందుకు కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మైక్రోచిప్ ప్రెసిడెంట్, సీఈవో గణేశ్‌మూర్తి తెలిపారు. కోకాపేటలో గోల్డెన్ మైల్ ఆఫీస్ టవర్‌లో 1,68,000 చదరపు అడుగుల్లో ఆర్అండ్డీ సెంటర్‌ను 5 అంతస్థుల్లో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సెంటర్ దేశంలోని అగ్రశేణి వ్యాపార కారిడార్లలో ఉండటంతో గ్లోబల్ మైక్రోచిప్ వ్యాపార అవసరాలకు, ఈ ప్రాంతంలో పెరుగుతున్న తమ కస్టమర్ బేస్‌కు మద్దతుగా నిలుస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఐఈఎస్ఏ అధ్యక్షుడు కే కృష్ణమూర్తి, మైక్రో చిప్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ వైస్‌ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
కొత్త ఆవిష్కరణ టీ-ఫేస్
‘తెలంగాణ ప్రభుత్వం కొత్తగా టీ-ఫేస్ (తెలంగాణ ఫ్యాబ్లెస్ యాక్సిలరేటర్ త్రూ క్లౌడ్ ఎనేబుల్మెంట్)ను ఆవిష్కరించింది. దీని ద్వారా వీఎల్ఎస్ఐ (వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్)కి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేందుకు దోహదం చేస్తుంది. ఫ్యాబ్లెస్ చిప్ డిజైనింగ్‌లో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి వర్చువల్ ఇంక్యుబేషన్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉంటుంది. హైదరాబాద్ ఇప్పటికే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా ప్రసిద్ధి చెందింది. టీ హబ్, టీవర్క్స్లను ఏర్పాటు చేసి సరికొత్త ఆవిష్కరణలు వచ్చేలా స్టార్టప్‌లకు ప్రోత్సహిస్తున్నాం. సెమీకండక్టర్ రంగంలో మనం ప్రారంభ దశలో ఉన్నాం. ఇందుకోసమే ప్రభుత్వం టీ-ఫేస్‌ను తీసుకువచ్చింది. ఇందులో హైదరాబాద్ కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తున్నాం’ కేటీఆర్ అని వెల్లడించారు.