హైదరాబాద్: తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పల్లె, బస్తీ దవాఖానలతో పేదల వద్దకే అత్యాధునిక వైద్య సేవలు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నార్సింగిలో 225 పడకలతో కొత్తగా ఏర్పాటుచేసిన శంకర ఐ హాస్పిటల్‌ను (Sankara Eye Hospital) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శంకర నేత్రాలయ వైద్య సేవలను ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కంటి సమస్యలు ఉన్నవారిని దవాఖానకు తీసుకొచ్చి సేవలు అందించాలనుకోవడం గొప్ప విషయమన్నారు.
సీఎం కేసీఆర్ కంటి వెలుగు (Kanti Velugu) కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి చెప్పారు. కంటి వెలుగు రెండో దశను ఖమ్మంలో కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ ఆరంభించారని తెలిపారు. రాష్ట్రంలో గురువారం నాటికి కోటి మందికి కంటి పరీక్షలు పూర్తిచేశామన్నారు. శంకర నేత్రాలయ వాహనాలకు లైఫ్, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపునిస్తున్నామని చెప్పారు.