Minister KTR | కేంద్రం రైతులపై కత్తి కట్టిందని, వారిని రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు భారీ ఎత్తున సాగవుతున్నాయన్నారు. లక్ష35 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు. 2015 నుంచి ఈ రోజుకి సుమారు 50లక్షల అదనపు ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రైతుబంధు, రైతు బీమా సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కానీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవహేళనగా మాట్లాడరని విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయం పండగ మారుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు భాదను కలిగిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల మీద కత్తి కట్టిందని, రైతులను రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయం అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం వ్యవసాయాన్ని, కరెంటును కార్పొరేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే విషయాన్ని పదేపదే సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు అదే విషయం నిజమవుతున్నదన్నారు. కేంద్రం అన్ని రంగాల్లోని సంస్థలు అమ్ముతున్నదని, చివరికి ధాన్య సేకరణ అంశాన్ని కూడా ప్రైవేటుపరం చేబోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పంటలు సేకరించే పని నుంచి కేంద్రం తప్పించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదైతే.. దాన్నుంచి కూడా తప్పించుకుంటుందన్నారు. విద్యుత్ రంగాన్ని కచ్చితంగా ప్రైవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకుసాగుతోందన్నారు. దేశ పరిస్థితులపై అవగాహన లేకుండా నల్ల చట్టాలను తీసుకువచ్చి.. 700 మంది రైతులను చంపిన తర్వాత, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన నరేంద్ర మోదీకి బుద్ధి మారలేదన్నారు.
అనాలోచిత అసమర్ధ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్ రంగాన్ని దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో నైజీరియా కన్నా ఎక్కువ మంది పేదలు భారతదేశంలో ఉన్నారన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా దారుణంగా హంగర్ ఇండెక్స్‌లో భారత్‌కు స్థానం దక్కిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే వ్యవసాయం సంక్షోభంలో పడుతున్నది, కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చింది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంతో పాటు దేశంలోని రైతన్నలంతా గుర్తించాలన్నారు.
ప్రజలతో ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటుతో సంబంధం లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీని ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తన కార్పొరేట్ మిత్రులకు అప్పచెప్పడానికే నరేంద్ర మోదీ ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రూ.3వేలకు వచ్చే సింగరేణి బొగ్గును కాదని.. రూ.35వేలకు ఆస్ట్రేలియన్ బొగ్గును కొంటున్నారన్నారు. ఇది తన కార్పొరేట్ మిత్రులు చేస్తున్న బొగ్గు వ్యాపారం కోసమేనన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలను దివాళా తీయించడం కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. తన కార్పొరేట్ మిత్రుడిని ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలోకి తీసుకుపోవడం కోసం దేశంలోని వ్యవసాయ, విద్యుత్ రంగాన్ని పణంగా పెట్టి దివాళా తీయించే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ పని చేయిస్తున్నారని విమర్శించారు. అందుకే ఆయన కోసం శ్రీలంక వంటి దేశాల్లో కార్పొరేట్ మిత్రుని తరఫున పైరవీ చేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విద్యుత్ బిల్లులను అడ్డుకుంటామని శాసనసభ సాక్షిగా చెప్పినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. బిల్లుచట్టంగా మారితే రైతన్నల ఉచిత కరెంటుతోపాటు దళిత, గిరిజన, రజక, నాయి బ్రాహ్మణ వంటి వృత్తుల వారికి, కొన్ని పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ కూడా పోతుందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రుణాలు రాకుండా చేసి వాటిని దివాళా తీయించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని మండిపడ్డారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తున్నదని ఆరోపించారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు అమలులోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు భారీగా నష్టపోతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నతో పాటు సిరిసిల్లలోని నేతన్నలు సబ్సిడీ లేకుండా చావుదెబ్బ తింటారని, సంక్షోభంలోకి పోతారన్నారు. ప్రీపెయిడ్ మీటర్లతో ముందు డబ్బులు కడితేనే విద్యుత్తు లభిస్తుందన్నారు. ప్రైవేటు కంపెనీలు విద్యుత్ పంపిణీ రంగంలోకి దిగితే పెట్రోల్ రేట్ల మాదిరి రోజురోజుకి విద్యుత్ రేట్లు మారుతాయన్నారు. విద్యుత్ రేట్లు అడ్డగోలుగా భారీగా పెరుగుతాయన్నారు.
నల్ల చట్టాల మాదిరే విద్యుత్ చట్టాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఉచితాలు రద్దు చేయాలంటూ మాట్లాడుతున్న ప్రధానమంత్రి తన కార్పొరేట్ మిత్రులకు లక్షల కోట్లు మాఫీ చేశారన్నారు. రైతులకు ప్రోత్సాహాకాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు.. పేదలను కొట్టి పెద్దలకు వేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. వచ్చే సీజన్ నుంచి ధాన్యం సేకరణలో ప్రైవేట్ కంపెనీలు వచ్చే ప్రమాదముందన్నారు. తెలంగాణ వడ్లు కొనుమంటే భారీగా నిలువలు ఉన్నాయన్న కేంద్రం ఈ రోజు ఆహార ధాన్యాల కొరత ఉందని చెబుతోందన్నారు. మొన్నటికి మొన్న నాల్గేండ్ల వరకు నిల్వలు ఉన్నాయని బొంకిన, సిగ్గులేని కేంద్రం ఈ రోజు ఎగుమతులను రద్దు చేసిందని ఆరోపించారు.
ఎట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను అంగీకరించమని ముఖ్యమంత్రి రైతాంగం పక్షాన నిలబడ్డారన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే 25వేల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తామన్నా.. సీఎం కేసీఆర్ రైతుల పక్షాననే నిలబడ్డారన్నారు. కేసీఆర్ చెప్పినట్లు వ్యవసాయన్ని దివాళా తీయించడం, గల్లీకొక కరెంట్ పంపిణీ కంపెనీని పెట్టి సమాజంలోని సబ్సిడీ, ఉచిత విద్యుత్‌ని అడ్డుకునే కేంద్రం కుటీల బుద్ధిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని విభేదాలను పక్కనపెట్టి ఏకోన్ముఖంగా కేంద్రానికి మన నిరసన తెలుపాలని, ఈ విషయం పైన ప్రజలను జాగృతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు తెలిపారు.