ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులంతా తెలంగాణ వ్యతిరేకులే : మంత్రి కేటీఆర్ ధ్వజం
బీజేపీ తెలంగాణ వ్యతిరేక వైఖరితో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దక్కకుండా పోతున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన
- తెలంగాణపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరో మోసం
- కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదన్న కేంద్రమంత్రి ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమన్న కేంద్ర మంత్రి ప్రకటన పచ్చి దగా, మోసం
- తెలంగాణకి ప్రతి విషయంలో ద్రోహం చేయడమే బీజేపీ నైజం
- తెలంగాణకు నిరంతరం ద్రోహం చేయడమే బీజేపీ విధానమా?
- తెలంగాణ వ్యతిరేక విధానాలపై దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సవాల్
- తెలంగాణ ప్రయోజనాల పట్ల స్థానిక బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోచ్ ఫ్యాక్టరీ కోసం నిలదీయాలి
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మాటమార్చడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న తెలంగాణ వ్యతిరేక విధానాలకు కొనసాగింపుగానే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారని ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతో పాటు పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వ తీరును చూసి ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయని విమర్శించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు ధోఖా ఇవ్వడంలో గత పాలకులను నేటి మోదీ సర్కార్ పాలన మించిపోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందనడానికి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకొక ఉదాహరణ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ తెలంగాణ వ్యతిరేక వైఖరితో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దక్కకుండా పోతున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చామన్న కేటీఆర్, ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి కూడా కేంద్రానికి ఇచ్చామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు లెక్కలేనన్ని విజ్ఞప్తులు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేంద్రం ఎప్పుడూ స్పందించలేదన్నారు.
దేశంలో ఎక్కడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో కేంద్రం ప్రకటించడం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అవమానించడమేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా తన రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర లాతూర్కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ మరట్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 625 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం తెలంగాణపై మాత్రం సవతి ప్రేమను చూపించిందన్నారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు దక్కిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కడం తెలంగాణ అభివృద్ధి పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న మోసపూరిత వైఖరిని బయటపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం చేసిన దగాతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందన్నారు. కోచ్ ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ యువత కడుపు కొట్టిందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల పట్ల, వారి అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రపూరిత విధానాలను ప్రజలు తప్పక తిప్పికొడతారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేంతవరకు కేంద్ర ప్రభుత్వంపైన తెలంగాణ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు కేంద్రంలోని తమ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిలదీయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఓవైపు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా… ఇక్కడి రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమి తరిమి కొడతారని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

